Guru · Traditional devotional text · Source: vignanam.org (Traditional devotional text (public-domain shlokas))
శిరిడీవాసా సాయిప్రభో జగతికి మూలం నీవే ప్రభో దత్త దిగంబర అవతారం నీలో సృష్టి వ్యవహారమ్ ॥
త్రిమూర్తిరూపా ఓ సాయీ కరుణించి కాపాడోయి దర్శనమియ్య గరావయ్య ముక్తికి మార్గం చూపుమయా ॥ 1 ॥ శిరిడీవాసా సాయిప్రభో ॥
కఫిని వస్త్రము ధరియించి భుజముకు జోలీ తగిలించి నింబ వృక్షపు ఛాయలో ఫకీరు వేషపు ధారణలో కలియుగమందున వెలసితివి త్యాగం సహనం నేర్పితివి శిరిడీ గ్రామం నీ వాసం భక్తుల మదిలో నీ రూపమ్ ॥ 2 ॥ శిరిడీవాసా సాయిప్రభో ॥
చాంద్ పాటిల్ ను కలుసుకుని ఆతని బాధలు తెలుసుకుని గుర్రము జాడ తెలిపితివి పాటిల్ బాధను తీర్చితివి వెలిగించావు జ్యోతులను నీవుపయోగించి జలములను అచ్చెరువొందెను ఆ గ్రామం చూసి వింతైన ఆ దృశ్యమ్ ॥ 3 ॥ శిరిడీవాసా సాయిప్రభో ॥
బాయిజా చేసెను నీ సేవ ప్రతిఫలమిచ్చావో దేవా నీ ఆయువును బదులిచ్చి తాత్యాను నీవు బ్రతికించి పశుపక్షులను ప్రేమించి ప్రేమతో వాటిని లాలించి జీవులపైన మమకారం చిత్రమయా నీ వ్యవహారమ్ ॥ 4 ॥ శిరిడీవాసా సాయిప్రభో ॥
నీ ద్వారములో నిలిచితిని నిన్నే నిత్యము కొలిచితిని అభయమునిచ్చి బ్రోవుమయా ఓ శిరిడీశా దయామయా ధన్యము ద్వారక ఓ మాయీ నీలో నిలిచెను శ్రీసాయి నీ ధుని మంటల వేడిమికి పాపము పోవును తాకిడికి ॥ 5 ॥ శిరిడీవాసా సాయిప్రభో ॥
ప్రళయ కాలము ఆపితివి భక్తులను నీవు బ్రోచితివి చేసి మహమ్మారీ నాశం కాపాడి శిరిడీ గ్రామం అగ్నిహోత్రి శాస్త్రికి లీలా మహాత్మ్యం చూపించి శ్యామాను బ్రతికించితివి పాము విషము తొలిగించి ॥ 6 ॥ శిరిడీవాసా సాయిప్రభో ॥
Offered for worship and study, not as prediction. Non-commercial.
More devotional texts
భక్త భీమాజీకి క్షయరోగం నశియించే ఆతని సహనం ఊదీ వైద్యం చేసావు వ్యాధిని మాయం చేసావు కాకాజీకి ఓ సాయి విఠల దర్శన మిచ్చితివి దామూకిచ్చి సంతానం కలిగించితివి సంతోషమ్ ॥ 7 ॥ శిరిడీవాసా సాయిప్రభో ॥
కరుణాసింధూ కరుణించు మాపై కరుణ కురిపించు సర్వం నీకే అర్పితము పెంచుము భక్తి భావమును ముస్లిం అనుకొని నిను మేఘూ తెలుసుకుని ఆతని బాధ దాల్చి శివశంకర రూపం ఇచ్చావయ్యా దర్శనము ॥ 8 ॥ శిరిడీవాసా సాయిప్రభో ॥
డాక్టరుకు నీవు రామునిగా బల్వంతకు శ్రీదత్తునిగా నిమోనుకరకు మారుతిగా చిదంబరకు శ్రీగణపతిగా మార్తాండకు ఖండోబాగా గణూకు సత్యదేవునిగా నరసింహస్వామిగా జోషికి దర్శనము నిచ్చిన శ్రీసాయి ॥ 9 ॥ శిరిడీవాసా సాయిప్రభో ॥
రేయి పగలు నీ ధ్యానం నిత్యం నీ లీలా పఠనం భక్తితో చేయండి ధ్యానం లభించును ముక్తికి మార్గం పదకొండు నీ వచనాలు బాబా మాకవి వేదాలు శరణని వచ్చిన భక్తులను కరుణించి నీవు బ్రోచితివి ॥ 10 ॥ శిరిడీవాసా సాయిప్రభో ॥
అందరిలోన నీ రూపం నీ మహిమ అతి శక్తిమయం ఓ సాయి మేము మూఢులము ఒసగుమయా మాకు జ్ఞానమును సృష్టికి నీవేనయ మూలం సాయి మేము సేవకులం సాయి నామము తలచెదము నిత్యము సాయిని కొలిచెదము ॥ 11 ॥ శిరిడీవాసా సాయిప్రభో ॥
భక్తి భావన తెలుసుకొని సాయిని మదిలో నిలుపుకొని చిత్తముతో సాయీ ధ్యానం చేయండి ప్రతినిత్యం బాబా కాల్చిన ధుని ఊది నివారించును అది వ్యాధి సమాధి నుండి శ్రీసాయి భక్తులను కాపాడేనోయి ॥ 12 ॥ శిరిడీవాసా సాయిప్రభో ॥
మన ప్రశ్నలకు జవాబులు తెలుపును సాయి చరితములు వినండి లేక చదవండి సాయి సత్యము చూడండి సత్సంగమును చేయండి సాయి స్వప్నము పొందండి భేద భావమును మానండి సాయి మన సద్గురువండి ॥ 13 ॥ శిరిడీవాసా సాయిప్రభో ॥
వందనమయ్యా పరమేశా ఆపద్బాంధవ సాయీశా మా పాపములూ కడతేర్చు మా మది కోరిక నెరవేర్చు కరుణామూర్తి ఓ సాయి కరుణతో మము దరిచేర్చోయీ మా మనసే నీ మందిరము మా పలుకులే నీకు నైవేద్యమ్ ॥ 14 ॥ శిరిడీవాసా సాయిప్రభో ॥
అఖిలాండకోటి బ్రహ్మాండనాయక రాజాధిరాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీసచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జై ॥
Browse Related Categories: