Sri Rama · Traditional devotional text · Source: vignanam.org (Traditional devotional text (public-domain shlokas))
రాగం: ధన్యాసి తాళం: ఆది
తారక మంత్రము కోరిన దొరికెను ధన్యుడనైతిని ఓరన్నా ॥ పల్లవి ॥
మీరిన కాలుని దూతలపాలిటి మృత్యువుయని మదినమ్ముక యున్న ॥ అనుపల్లవి ॥ తారక మంత్రము ॥
మచ్చికతో నితరాంతరమ్ముల మాయలలో పడబోకన్నా హెచ్చుగ నూటయెనిమిది తిరుపతులెలమి తిరుగపనిలేదన్నా ముచ్చటగా తా పుణ్యనదులలో మునుగుట పనియేమిటికన్నా వచ్చెడి పరువపు దినములలో సుడిపడుటలు మానకయు ॥ 1 ॥ తారక మంత్రము ॥
ఎన్నిజన్మములనుండి చూచినను ఏకోనారాయణుడన్న అన్ని రూపులై యున్న నాపరాత్పరు నామహాత్ముని కథ విన్నా ఎన్ని జన్మములజేసిన పాపములీ జన్మముతో విడునన్నా అన్నిటికిది కడసారి జన్మము సత్యంబిక పుట్టుట సున్నా ॥ 2 ॥ తారక మంత్రము ॥
నిర్మల మంతర్లక్ష్యభావమున నిత్యానందముతోనున్న కర్మంబులువిడి మోక్షపద్ధతిని కన్నుల నే జూచుచునున్న ధర్మము తప్పక భద్రాద్రీశుని తన మదిలో నమ్ముకయున్న మర్మము దెలిసిన రామదాసుని హృన్మందిరముననే యున్న ॥ 3 ॥ తారక మంత్రము ॥
Browse Related Categories:
Offered for worship and study, not as prediction. Non-commercial.
More devotional texts