Shatakams · Traditional devotional text · Source: vignanam.org (Traditional devotional text (public-domain shlokas))
001 సీ. శ్రీమనోహర । సురా - ర్చిత సింధుగంభీర । భక్తవత్సల । కోటి - భానుతేజ । కంజనేత్ర । హిరణ్య - కశ్యపాంతక । శూర । సాధురక్షణ । శంఖ - చక్రహస్త । ప్రహ్లాద వరద । పా - పధ్వంస । సర్వేశ । క్షీరసాగరశాయి । - కృష్ణవర్ణ । పక్షివాహన । నీల - భ్రమరకుంతలజాల । పల్లవారుణపాద - పద్మయుగళ ।
తే. చారుశ్రీచందనాగరు - చర్చితాంగ । కుందకుట్మలదంత । వై - కుంఠధామ । భూషణవికాస । శ్రీధర్మ - పురనివాస । దుష్టసంహార । నరసింహ - దురితదూర ।
002 సీ. పద్మలోచన । సీస - పద్యముల్ నీ మీద జెప్పబూనితినయ్య । - చిత్తగింపు గణ యతి ప్రాస ల - క్షణము జూడగలేదు పంచకావ్య శ్లోక - పఠన లేదు అమరకాండత్రయం - బరసి చూడగలేదు శాస్త్రీయ గ్రంధముల్ - చదువలేదు నీ కటాక్షంబున - నే రచించెద గాని ప్రజ్ఞ నాయది గాదు - ప్రస్తుతింప
తే. దప్పుగలిగిన సద్భక్తి - తక్కువౌనె చెఱకునకు వంకపోయిన - చెడునె తీపు? భూషణవికాస । శ్రీధర్మ - పురనివాస । దుష్టసంహార । నరసింహ - దురితదూర ।
003 సీ. నరసింహ । నీ దివ్య - నామమంత్రముచేత దురితజాలము లన్ని - దోలవచ్చు నరసింహ । నీ దివ్య - నామమంత్రముచేత బలువైన రోగముల్ - పాపవచ్చు నరసింహ । నీ దివ్య - నామమంత్రముచేత రిపుసంఘముల సంహ - రింపవచ్చు నరసింహ । నీ దివ్య - నామమంత్రముచేత దండహస్తుని బంట్ల - దరమవచ్చు
తే. భళిర । నే నీ మహామంత్ర - బలముచేత దివ్య వైకుంఠ పదవి సా - ధింపవచ్చు భూషణవికాస । శ్రీధర్మ - పురనివాస । దుష్టసంహార । నరసింహ - దురితదూర ।
004 సీ. ఆదినారాయణా । - యనుచు నాలుకతోడ బలుక నేర్చినవారి - పాదములకు సాష్టాంగముగ నమ - స్కార మర్పణ జేసి ప్రస్తుతించెదనయ్య - బహువిధముల ధరణిలో నరులెంత - దండివారైనను నిన్ను గాననివారి - నే స్మరింప మేము శ్రేష్ఠుల మంచు - మిదుకుచుంచెడివారి చెంత జేరగనోను - శేషశయన
Offered for worship and study, not as prediction. Non-commercial.
More devotional texts
తే. పరమ సాత్వికులైన నీ - భక్తవరుల దాసులకు దాసుడను జుమీ - ధాత్రిలోన భూషణవికాస । శ్రీధర్మ - పురనివాస । దుష్టసంహార । నరసింహ - దురితదూర ।
005 సీ. ఐశ్వర్యములకు ని - న్ననుసరింపగలేదు ద్రవ్య మిమ్మని వెంట - దగులలేదు కనక మిమ్మని చాల - గష్టపెట్టగలేదు పల్ల కిమ్మని నోట - బలకలేదు సొమ్ము లిమ్మని నిన్ను - నమ్మి కొల్వగలేదు భూము లిమ్మని పేరు - పొగడలేదు బలము లిమ్మని నిన్ను - బ్రతిమాలగాలేదు పసుల నిమ్మని పట్టు - పట్టలేదు
తే. నేను గోరిన దొక్కటే - నీలవర్ణ చయ్యనను మోక్షమిచ్చిన - జాలు నాకు భూషణవికాస । శ్రీధర్మ - పురనివాస । దుష్టసంహార । నరసింహ - దురితదూర ।
006 సీ. మందుండనని నన్ను - నింద చేసిననేమి? నా దీనతను జూచి - నవ్వ నేమి? దూరభావములేక - తూలనాడిన నేమి? ప్రీతిసేయక వంక - బెట్ట నేమి? కక్కసంబులు పల్కి - వెక్కిరించిన నేమి? తీవ్రకోపముచేత - దిట్ట నేమి? హెచ్చుమాటలచేత - నెమ్మె లాడిన నేమి? చేరి దాపట గేలి - చేయనేమి?
తే. కల్పవృక్షంబువలె నీవు - గల్గ నింక బ్రజల లక్ష్యంబు నాకేల? - పద్మనాభ । భూషణవికాస । శ్రీధర్మ - పురనివాస । దుష్టసంహార । నరసింహ - దురితదూర ।
007 సీ. చిత్తశుద్ధిగ నీకు - సేవజేసెదగాని పుడమిలో జనుల మె - ప్పులకు గాదు జన్మపావనతకై - స్మరణజేసెద గాని సరివారిలో బ్రతి - ష్థలకు గాదు ముక్తికోసము నేను - మ్రొక్కి వేడెదగాని దండిభాగ్యము నిమి - త్తంబు గాదు నిన్ను బొగడగ విద్య - నేర్చితినేకాని కుక్షినిండెడు కూటి - కొఱకు గాదు
తే. పారమార్థికమునకు నే బాటుపడితి గీర్తికి నపేక్షపడలేదు - కృష్ణవర్ణ । భూషణవికాస । శ్రీధర్మ - పురనివాస । దుష్టసంహార । నరసింహ - దురితదూర ।
008 సీ. శ్రవణ రంధ్రముల నీ - సత్కథల్ పొగడంగ లేశ మానందంబు - లేనివాడు పుణ్యవంతులు నిన్ను - బూజసేయగ జూచి భావమందుత్సాహ - పడనివాడు భక్తవర్యులు నీ ప్ర - భావముల్ పొగడంగ దత్పరత్వములేక - తలగువాడు తనచిత్తమందు నీ - ధ్యాన మెన్నడు లేక కాలమంతయు వృధా - గడపువాడు
తే. వసుధలోనెల్ల వ్యర్ధుండు - వాడె యగును మఱియు జెడుగాక యెప్పుడు - మమతనొంది. భూషణవికాస । శ్రీధర్మ - పురనివాస । దుష్టసంహార । నరసింహ - దురితదూర ।
009 సీ. గౌతమీస్నానాన - గడతేఱుద మటన్న మొనసి చన్నీళ్లలో - మునుగలేను తీర్థయాత్రలచే గృ - తార్థు డౌదమటన్న బడలి నేమంబు లే - నడపలేను దానధర్మముల స - ద్గతిని జెందుదమన్న ఘనముగా నాయొద్ద - ధనములేదు తపమాచరించి సా - ర్ధకము నొందుదమన్న నిమిషమైన మనస్సు - నిలుపలేను
తే. కష్టములకోర్వ నాచేత - గాదు నిన్ను స్మరణచేసెద నా యధా - శక్తి కొలది. భూషణవికాస । శ్రీధర్మ - పురనివాస । దుష్టసంహార । నరసింహ - దురితదూర ।
010 సీ. అర్థివాండ్రకు నీక - హాని జేయుట కంటె దెంపుతో వసనాభి - దినుట మేలు ఆడుబిడ్డలసొమ్ము - లపహరించుట కంటె బండ గట్టుక నూత - బడుట మేలు పరులకాంతల బట్టి - బల్మి గూడుట కంటె బడబాగ్ని కీలల - బడుట మేలు బ్రతుకజాలక దొంగ - పనులు చేయుట కంటె గొంగుతో ముష్టెత్తు - కొనుట మేలు
తే. జలజదళనేత్ర నీ భక్త - జనులతోడి జగడమాడెడు పనికంటె - జావు మేలు భూషణవికాస । శ్రీధర్మ - పురనివాస । దుష్టసంహార । నరసింహ - దురితదూర ।
011 సీ. గార్దభంబున కేల - కస్తూరి తిలకంబు? మర్కటంబున కేల - మలయజంబు? శార్ధూలమునక కేల - శర్కరాపూపంబు? సూకరంబున కేల - చూతఫలము? మార్జాలమున కేల - మల్లెపువ్వులబంతి? గుడ్లగూబల కేల - కుండలములు? మహిషాని కేల ని - ర్మలమైన వస్త్రముల్? బకసంతతికి నేల - పంజరంబు?
తే. ద్రోహచింతన జేసెడి - దుర్జనులకు మధురమైనట్టి నీనామ - మంత్రమేల? భూషణవికాస । శ్రీధర్మ - పురనివాస । దుష్టసంహార । నరసింహ - దురితదూర ।
012 సీ. పసరంబు వంజైన - బసులకాపరి తప్పు ప్రజలు దుర్జనులైన - ప్రభుని తప్పు భార్య గయ్యాళైన - బ్రాణనాధుని తప్పు తనయుడు దుష్టయిన - తండ్రి తప్పు సైన్యంబు చెదిరిన - సైన్యనాధుని తప్పు కూతురు చెడుగైన - మాత తప్పు అశ్వంబు చెడుగైన - నారోహకుని తప్పు దంతి దుష్టయిన మా - వంతు తప్పు
తే. ఇట్టి తప్పులెఱుంగక - యిచ్చవచ్చి నటుల మెలగుదు రిప్పు డీ - యవని జనులు. భూషణవికాస । శ్రీధర్మ - పురనివాస । దుష్టసంహార । నరసింహ - దురితదూర ।
013 సీ. కోతికి జలతారు - కుళ్లాయి యేటికి? విరజాజి పూదండ - విధవ కేల? ముక్కిడితొత్తుకు - ముత్తెంపు నత్తేల? నద్ద మేమిటికి జా - త్యంధునకును? మాచకమ్మకు నేల - మౌక్తికహారముల్? క్రూరచిత్తునకు స - ద్గోష్ఠు లేల? ఱంకుబోతుకు నేల - బింకంపు నిష్ఠలు? వావి యేటికి దుష్ట - వర్తనునకు?
తే. మాట నిలుకడ కుంకరి - మోటు కేల? చెవిటివానికి సత్కథ - శ్రవణ మేల? భూషణవికాస । శ్రీధర్మ - పురనివాస । దుష్టసంహార । నరసింహ - దురితదూర ।
014 సీ. మాన్యంబులీయ స - మర్ధుడొక్కడు లేడు మాన్యముల్ చెఱుప స - మర్ధు లంత యెండిన యూళ్లగో - డెఱిగింప డెవ్వడు బండిన యూళ్లము - బ్రభువు లంత యితడు పేద యటంచు - నెఱిగింప డెవ్వండు కలవారి సిరు లెన్న - గలరు చాల దనయాలి చేష్టల - తప్పెన్న డెవ్వడు బెఱకాంత ఱంకెన్న - బెద్ద లంత
తే. యిట్టి దుష్టుల కధికార - మిచ్చినట్టి ప్రభువు తప్పు లటంచును - బలుకవలెను. భూషణవికాస । శ్రీధర్మ - పురనివాస । దుష్టసంహార । నరసింహ - దురితదూర ।
015 సీ. తల్లిగర్భమునుండి - ధనము తే డెవ్వడు వెళ్లిపోయెడినాడు - వెంటరాదు లక్షాధికారైన - లవణ మన్నమె కాని మెఱుగు బంగారంబు - మ్రింగబోడు విత్త మార్జనజేసి - విర్రవీగుటె కాని కూడబెట్టిన సొమ్ము - తోడరాదు పొందుగా మఱుగైన - భూమిలోపల బెట్టి దానధర్మము లేక - దాచి దాచి
తే. తుదకు దొంగల కిత్తురో - దొరల కవునొ తేనె జుంటీగ లియ్యవా - తెరువరులకు? భూషణవికాస । శ్రీధర్మ - పురనివాస । దుష్టసంహార । నరసింహ - దురితదూర ।
016 సీ. లోకమం దెవడైన - లోభిమానవు డున్న భిక్ష మర్థిమి జేత - బెట్టలేడు తాను బెట్టకయున్న - తగవు పుట్టదుగాని యొరులు పెట్టగ జూచి - యోర్వలేడు దాతదగ్గఱ జేరి - తన ముల్లె చెడినట్లు జిహ్వతో జాడీలు - చెప్పుచుండు ఫలము విఘ్నంబైన - బలు సంతసమునందు మేలు కల్గిన జాల - మిణుకుచుండు
తే. శ్రీరమానాథ । యిటువంటి - క్రూరునకును భిక్షుకుల శత్రువని - పేరు పెట్టవచ్చు. భూషణవికాస । శ్రీధర్మ - పురనివాస । దుష్టసంహార । నరసింహ - దురితదూర ।
017 సీ. తనువులో బ్రాణముల్ - తరళిపొయ్యెడివేళ నీ స్వరూపమును ధ్యా - నించునతడు నిమిషమాత్రములోన - నిన్ను జేరును గాని యముని చేతికి జిక్కి - శ్రమలబడడు పరమసంతోషాన - భజన జేసెడివారి పుణ్య మేమనవచ్చు - భోగిశయన మోక్షము నీ దాస - ముఖ్యుల కగు గాని నరక మెక్కడిదయ్య - నళిననేత్ర
తే. కమలనాభ నీ మహిమలు - గానలేని తుచ్ఛులకు ముక్తిదొరకుట - దుర్లభంబు. భూషణవికాస । శ్రీధర్మ - పురనివాస । దుష్టసంహార । నరసింహ - దురితదూర ।
018 సీ. నీలమేఘశ్యామ । - నీవె తండ్రివి మాకు కమలవాసిని మమ్ము - గన్నతల్లి నీ భక్తవరులంత - నిజమైన బాంధవుల్ నీ కటాక్షము మా క - నేకధనము నీ కీర్తనలు మాకు - లోక ప్రపంచంబు నీ సహాయము మాకు - నిత్యసుఖము నీ మంత్రమే మాకు - నిష్కళంకపు విద్య నీ పద ధ్యానంబు - నిత్యజపము
తే. తోయజాతాక్ష నీ పాద - తులసిదళము రోగముల కౌషధము బ్రహ్మ - రుద్రవినుత. భూషణవికాస । శ్రీధర్మ - పురనివాస । దుష్టసంహార । నరసింహ - దురితదూర ।
019 సీ. బ్రతికినన్నాళ్లు నీ - భజన తప్పను గాని మరణకాలమునందు - మఱతునేమొ యావేళ యమదూత - లాగ్రహంబున వచ్చి ప్రాణముల్ పెకలించి - పట్టునపుడు కఫ వాత పైత్యముల్ - గప్పగా భ్రమచేత గంప ముద్భవమంది - కష్టపడుచు నా జిహ్వతో నిన్ను - నారాయణా యంచు బిలుతునో శ్రమచేత - బిలువనొ
తే. నాటి కిప్పుడె చేతు నీ - నామభజన తలచెదను, జెవి నిడవయ్య । - ధైర్యముగను. భూషణవికాస । శ్రీధర్మ - పురనివాస । దుష్టసంహార । నరసింహ - దురితదూర ।
020 సీ. పాంచభౌతికము దు - ర్బలమైన కాయం బి దెప్పుడో విడుచుట - యెఱుకలేదు శతవర్షములదాక - మితము జెప్పిరి గాని నమ్మరా దామాట - నెమ్మనమున బాల్యమందో మంచి - ప్రాయమందో లేక ముదిమియందో లేక - ముసలియందొ యూరనో యడవినో - యుదకమధ్యముననో యెప్పుడో విడుచుట - యేక్షణంబొ
తే. మరణమే నిశ్చయము బుద్ధి - మంతుడైన దేహమున్నంతలో మిమ్ము - దెలియవలయు. భూషణవికాస । శ్రీధర్మ - పురనివాస । దుష్టసంహార । నరసింహ - దురితదూర ।
021 సీ. తల్లిదండ్రులు భార్య - తనయు లాప్తులు బావ మఱదు లన్నలు మేన - మామగారు ఘనముగా బంధువుల్ - గల్గినప్పటికైన దాను దర్లగ వెంట - దగిలి రారు యముని దూతలు ప్రాణ - మపగరించుక పోగ మమతతో బోరాడి - మాన్పలేరు బలగ మందఱు దుఃఖ - పడుట మాత్రమె కాని యించుక యాయుష్య - మియ్యలేరు
తే. చుట్టములమీది భ్రమదీసి - చూర జెక్కి సంతతము మిమ్ము నమ్ముట - సార్థకంబు. భూషణవికాస । శ్రీధర్మ - పురనివాస । దుష్టసంహార । నరసింహ - దురితదూర ।
022 సీ. ఇభరాజవరద । ని - న్నెంత బిల్చినగాని మాఱు పల్క వదేమి - మౌనితనమొ? మునిజనార్చిత । నిన్ను - మ్రొక్కి వేడినగాని కనుల జూడ వదేమి - గడుసుదనమొ? చాల దైన్యమునొంది - చాటు చొచ్చినగాని భాగ్య మియ్య వదేమి - ప్రౌఢతనమొ? స్థిరముగా నీపాద - సేవ జేసెద నన్న దొరకజాల వదేమి - ధూర్తతనమొ?
తే. మోక్షదాయక । యిటువంటి - మూర్ఖజనుని కష్టపెట్టిన నీకేమి - కడుపునిండు. భూషణవికాస । శ్రీధర్మ - పురనివాస । దుష్టసంహార । నరసింహ - దురితదూర ।
023 సీ. నీమీద కీర్తనల్ - నిత్యగానము జేసి రమ్యమొందింప నా - రదుడగాను సావధానముగ నీ - చరణ పంకజ సేవ సలిపి మెప్పంపంగ - శబరిగాను బాల్యమప్పటినుండి - భక్తి నీయందున గలుగను బ్రహ్లాద - ఘనుడగాను ఘనముగా నీమీది - గ్రంథముల్ గల్పించి వినుతిసేయను వ్యాస - మునినిగాను
తే. సాధుడను మూర్ఖమతి మను - ష్యాధముడను హీనుడను జుమ్మి నీవు - న న్నేలుకొనుము. భూషణవికాస । శ్రీధర్మ - పురనివాస । దుష్టసంహార । నరసింహ - దురితదూర ।
024 సీ. అతిశయంబుగ గల్ల - లాడనేర్చితిగాని పాటిగా సత్యముల్ - పలుకనేర సత్కార్య విఘ్నముల్ - సలుప నేర్చితిగాని యిష్ట మొందగ నిర్వ - హింపనేర నొకరి సొమ్ముకు దోసి - లొగ్గ నేర్చితిగాని చెలువుగా ధర్మంబు - సేయనేర ధనము లియ్యంగ వ - ద్దనగ నేర్చితిగాని శీఘ్ర మిచ్చెడునట్లు - చెప్పనేర
తే. బంకజాతాక్ష । నే నతి - పాతకుడను దప్పులన్నియు క్షమియింప - దండ్రి వీవె । భూషణవికాస । శ్రీధర్మ - పురనివాస । దుష్టసంహార । నరసింహ - దురితదూర ।
025 సీ. ఉర్విలో నాయుష్య - మున్న పర్యంతంబు మాయ సంసారంబు - మరగి నరుడు సకల పాపములైన - సంగ్రహించును గాని నిన్ను జేరెడి యుక్తి - నేర్వలేడు తుదకు గాలునియొద్ది - దూత లిద్దఱు వచ్చి గుంజుక చని వారు - గ్రుద్దుచుండ హింస కోర్వగ లేక - యేడ్చి గంతులువేసి దిక్కు లేదని నాల్గు - దిశలు చూడ
తే. దన్ను విడిపింప వచ్చెడి - ధన్యు డేడి ముందు నీదాసుడై యున్న - ముక్తి గలుగు. భూషణవికాస । శ్రీధర్మ - పురనివాస । దుష్టసంహార । నరసింహ - దురితదూర ।
026 సీ. అధిక విద్యావంతు - లప్రయోజకులైరి పూర్ణశుంఠలు సభా - పూజ్యులైరి సత్యవంతులమాట - జన విరోధంబాయె వదరుబోతులమాట - వాసికెక్కె ధర్మవాదనపరుల్ - దారిద్ర్యమొందిరి పరమలోభులు ధన - ప్రాప్తులైరి పుణ్యవంతులు రోగ - భూత పీడితులైరి దుష్టమానవులు వ - ర్ధిష్ణులైరి
తే. పక్షివాహన । మావంటి - భిక్షుకులకు శక్తిలేదాయె నిక నీవె - చాటు మాకు. భూషణవికాస । శ్రీధర్మ - పురనివాస । దుష్టసంహార । నరసింహ - దురితదూర ।
027 సీ. భుజబలంబున బెద్ద - పులుల జంపగవచ్చు పాముకంఠము జేత - బట్టవచ్చు బ్రహ్మ రాక్షసకోట్ల - బాఱద్రోలగవచ్చు మనుజుల రోగముల్ - మాన్పవచ్చు జిహ్వ కిష్టముగాని - చేదు మ్రింగగవచ్చు బదను ఖడ్గము చేత - నదమవచ్చు గష్టమొందుచు ముండ్ల - కంపలో జొరవచ్చు దిట్టుబోతుల నోళ్లు - కట్టవచ్చు
తే. బుడమిలో దుష్టులకు జ్ఞాన - బోధ తెలిపి సజ్జనుల జేయలే డెంత - చతురుదైన. భూషణవికాస । శ్రీధర్మ - పురనివాస । దుష్టసంహార । నరసింహ - దురితదూర ।
028 సీ. అవనిలోగల యాత్ర - లన్ని చేయగవచ్చు ముఖ్యుడై నదులందు - మునుగవచ్చు ముక్కుపట్టుక సంధ్య - మొనసి వార్వగవచ్చు దిన్నగా జపమాల - ద్రిప్పవచ్చు వేదాల కర్థంబు - విఱిచి చెప్పగవచ్చు శ్రేష్ఠ్ క్రతువు లెల్ల - జేయవచ్చు ధనము లక్షలు కోట్లు - దానమియ్యగవచ్చు నైష్ఠికాచారముల్ - నడుపవచ్చు
తే. జిత్త మన్యస్థలంబున - జేరకుండ నీ పదాంభోజములయందు - నిలపరాదు. భూషణవికాస । శ్రీధర్మ - పురనివాస । దుష్టసంహార । నరసింహ - దురితదూర ।
029 సీ. కర్ణయుగ్మమున నీ - కథలు సోకినజాలు పెద్ద పోగుల జోళ్లు - పెట్టినట్లు చేతు లెత్తుచు బూజ - సేయగల్గినజాలు తోరంపు కడియాలు - దొడిగినట్లు మొనసి మస్తకముతో - మ్రొక్క గల్గినజాలు చెలువమైన తురాయి - చెక్కినట్లు గళము నొవ్వగ నిన్ను - బలుక గల్గినజాలు వింతగా గంఠీలు - వేసినట్లు
తే. పూని నిను గొల్చుటే సర్వ - భూషణంబు లితర భూషణముల నిచ్చ - గింపనేల. భూషణవికాస । శ్రీధర్మ - పురనివాస । దుష్టసంహార । నరసింహ - దురితదూర ।
030 సీ. భువనరక్షక । నిన్ను - బొగడనేరని నోరు వ్రజ కగోచరమైన - పాడుబొంద సురవరార్చిత । నిన్ను - జూడగోరని కనుల్ జలములోపల నెల్లి - సరపుగుండ్లు శ్రీరమాధిమ । నీకు - సేవజేయని మేను కూలి కమ్ముడువోని - కొలిమితిత్తి వేడ్కతో నీకథల్ - వినని కర్ణములైన గఠినశిలాదుల - గలుగు తొలలు
తే. పద్మలోచన నీమీద - భక్తిలేని మానవుడు రెండుపాదాల - మహిషమయ్య. భూషణవికాస । శ్రీధర్మ - పురనివాస । దుష్టసంహార । నరసింహ - దురితదూర ।
031 సీ. అతివిద్యనేర్చుట - అన్నవస్త్రములకే పసుల నార్జించుట - పాలకొఱకె సతిని బెండ్లాడుట - సంసార సుఖముకే సుతుల బోషించుట - గతులకొఱకె సైన్యముల్ గూర్చుట - శత్రుజయమునకే సాము నేర్చుటలెల్ల - చావుకొఱకె దానమిచ్చుటయు ముం - దటి సంచితమునకే ఘనముగా జదువుట - కడుపు కొఱకె
తే. యితర కామంబు గోరక - సతతముగను భక్తి నీయందు నిలుపుట - ముక్తి కొఱకె భూషణవికాస । శ్రీధర్మ - పురనివాస । దుష్టసంహార । నరసింహ - దురితదూర ।
032 సీ. ధరణిలో వేయేండ్లు - తనువు నిల్వగబోదు ధన మెప్పటికి శాశ్వ - తంబు గాదు దారసుతాదులు - తనవెంట రాలేరు భ్రుత్యులు మృతిని ద - ప్పింపలేరు బంధుజాలము తన్ను - బ్రతికించుకోలేరు బలపరాక్రమ మేమి - పనికి రాదు ఘనమైన సకల భా - గ్యం బెంత గల్గిన గోచిమాత్రంబైన - గొనుచుబోడు
తే. వెర్రి కుక్కల భ్రమలన్ని - విడిచి నిన్ను భజన జేసెడివారికి - బరమసుఖము. భూషణవికాస । శ్రీధర్మ - పురనివాస । దుష్టసంహార । నరసింహ - దురితదూర ।
033 సీ. నరసింహ । నాకు దు - ర్ణయములే మెండాయె సుగుణ మొక్కటిలేదు - చూడ జనిన నన్యకాంతల మీద - నాశ మానగలేను నొరుల క్షేమము చూచి - యోర్వలేను ఇటువంటి దుర్బుద్ధు - లిన్ని నా కున్నవి నేను జేసెడివన్ని - నీచకృతులు నావంటి పాపిష్ఠి - నరుని భూలోకాన బుట్టజేసితి వేల - భోగిశయన ।
తే. అబ్జదళనేత్ర । నాతండ్రి - వైన ఫలము నేరములు గాచి రక్షింపు - నీవె దిక్కు. భూషణవికాస । శ్రీధర్మ - పురనివాస । దుష్టసంహార । నరసింహ - దురితదూర ।
034 సీ. ధీరత బరుల నిం - దింప నేర్చితి గాని తిన్నగా నిను బ్రస్తు - తింపనైతి బొరుగు కామినులందు - బుద్ధి నిల్పితి గాని నిన్ను సంతతము ధ్యా - నింపనైతి బెరికిముచ్చట లైన - మురిసి వింటినిగాని యెంచి నీకథ లాల - కించనైతి గౌతుకంబున బాత - కము గడించితిగాని హెచ్చు పుణ్యము సంగ్ర - హింపనైతి
తే. నవనిలో నేను జన్మించి - నందు కేమి సార్థకము గానరాదాయె - స్వల్పమైన. భూషణవికాస । శ్రీధర్మ - పురనివాస । దుష్టసంహార । నరసింహ - దురితదూర ।
035 సీ. అంత్యకాలమునందు - నాయాసమున నిన్ను దలతునో తలపనో - తలతు నిపుడె నరసింహ । నరసింహ । - నరసింహ । లక్ష్మీశ । దానవాంతక । కోటి - భానుతేజ । గోవింద । గోవింద । - గోవింద । సర్వేశ । పన్నగాధిపశాయి । - పద్మనాభ । మధువైరి । మధువైరి । - మధువైరి । లోకేశ । నీలమేఘశరీర । నిగమవినుత ।
తే. ఈ విధంబున నీనామ - మిష్టముగను భజనసేయుచు నుందు నా - భావమందు. భూషణవికాస । శ్రీధర్మ - పురనివాస । దుష్టసంహార । నరసింహ - దురితదూర ।
036 సీ. ఆయురారోగ్య పు - త్రార్థ సంపదలన్ని కలుగజేసెడి భార - కర్త వీవె చదువు లెస్సగ నేర్పి - సభలో గరిష్ఠాధి కార మొందించెడి - ఘనుడ వీవె నడక మంచిది పెట్టి - నరులు మెచ్చేడునట్టి పేరు రప్పించెడి - పెద్ద వీవె బలువైన వైరాగ్య - భక్తిజ్ఞానములిచ్చి ముక్తి బొందించెడు - మూర్తి వీవె
తే. అవనిలో మానవుల కన్ని - యాసలిచ్చి వ్యర్థులను జేసి తెలిపెడి - వాడ వీవె. భూషణవికాస । శ్రీధర్మ - పురనివాస । దుష్టసంహార । నరసింహ - దురితదూర ।
037 సీ. కాయ మెంత భయాన - గాపాడిననుగాని ధాత్రిలో నది చూడ - దక్క బోదు ఏవేళ నేరోగ - మేమరించునొ? సత్త్వ మొందంగ జేయు నే - చందమునను ఔషధంబులు మంచి - వనుభవించిన గాని కర్మ క్షీణంబైన గాని - విడదు; కోటివైద్యులు గుంపు - గూడివచ్చిన గాని మరణ మయ్యెడు వ్యాధి - మాన్పలేరు
తే. జీవుని ప్రయాణకాలంబు - సిద్ధమైన నిలుచునా దేహ మిందొక్క - నిమిషమైన? భూషణవికాస । శ్రీధర్మ - పురనివాస । దుష్టసంహార । నరసింహ - దురితదూర ।
038 సీ. జందె మింపుగ వేసి - సంధ్య వార్చిన నేమి బ్రహ్మ మందక కాడు - బ్రాహ్మణుండు తిరుమణి శ్రీచూర్ణ - గురురేఖ లిడినను విష్ణు నొందక కాడు - వైష్ణవుండు బూదిని నుదుటను - బూసికొనిన నేమి శంభు నొందక కాడు - శైవజనుడు కాషాయ వస్త్రాలు - గట్టి కప్పిన నేమి యాశ పోవక కాడు - యతివరుండు
తే. ఎన్ని లౌకికవేషాలు - గట్టుకొనిన గురుని జెందక సన్ముక్తి - దొరకబోదు. భూషణవికాస । శ్రీధర్మ - పురనివాస । దుష్టసంహార । నరసింహ - దురితదూర ।
039 సీ. నరసింహ । నే నిన్ను - నమ్మినందుకు జాల నెనరు నాయందుంచు - నెమ్మనమున నన్ని వస్తువులు ని - న్నడిగి వేసటపుట్టె నింకనైన గటాక్ష - మియ్యవయ్య సంతసంబున నన్ను - స్వర్గమందే యుంచు భూమియందే యుంచు - భోగశయన । నయముగా వైకుంఠ - నగరమందే యుంచు నరకమందే యుంచు - నళిననాభ ।
తే. ఎచట నన్నుంచిననుగాని - యెపుడు నిన్ను మఱచి పోకుండ నీనామ - స్మరణనొసగు. భూషణవికాస । శ్రీధర్మ - పురనివాస । దుష్టసంహార । నరసింహ - దురితదూర ।
040 సీ. దేహ మున్నవఱకు - మోహసాగరమందు మునుగుచుందురు శుద్ధ - మూఢజనులు సలలితైశ్వర్యముల్ - శాశ్వతం బనుకొని షడ్భ్రమలను మాన - జాల రెవరు సర్వకాలము మాయ - సంసార బద్ధులై గురుని కారుణ్యంబు గోరుకొనరు జ్ఞాన భక్తి విరక్తు - లైన పెద్దల జూచి నింద జేయక - తాము నిలువలేరు
తే. మత్తులైనట్టి దుర్జాతి - మనుజులెల్ల నిన్ను గనలేరు మొదటికే - నీరజాక్ష. భూషణవికాస । శ్రీధర్మ - పురనివాస । దుష్టసంహార । నరసింహ - దురితదూర ।
041 సీ. ఇలలోన నే జన్మ - మెత్తినప్పటినుండి బహు గడించితినయ్య - పాతకములు తెలిసి చేసితి గొన్ని - తెలియజాలక చేసి బాధ నొందితి నయ్య - పద్మనాభ అనుభవించెడు నప్పు - దతి ప్రయాసంబంచు బ్రజలు చెప్పగ జాల - భయము గలిగె నెగిరి పోవుటకునై - యే యుపాయంబైన జేసి చూతమటన్న - జేతగాదు
తే. సూర్యశశినేత్ర । నీచాటు - జొచ్చి నాను కలుషములు ద్రుంచి నన్నేలు - కష్టమనక. భూషణవికాస । శ్రీధర్మ - పురనివాస । దుష్టసంహార । నరసింహ - దురితదూర ।
042 సీ. తాపసార్చిత । నేను - పాపకర్ముడనంచు నాకు వంకలబెట్ట - బోకుచుమ్మి నాటికి శిక్షలు - నన్ను చేయుటకంటె నేడు సేయుము నీవు - నేస్తమనక అతిభయంకరులైన - యమదూతలకు నన్ను నొప్పగింపకు మయ్య - యురగశయన । నీ దాసులను బట్టి - నీవు దండింపంగ వద్దు వద్దన రెంత - పెద్దలైన
తే. దండ్రివై నీవు పరపీడ - దగులజేయ వాసిగల పేరు కపకీర్తి - వచ్చునయ్య. భూషణవికాస । శ్రీధర్మ - పురనివాస । దుష్టసంహార । నరసింహ - దురితదూర ।
043 సీ. ధరణిలోపల నేను - తల్లిగర్భమునందు బుట్టినప్పటినుండి - పుణ్యమెఱుగ నేకాదశీవ్రతం - బెన్న డుండుగ లేదు తీర్థయాత్రలకైన - దిరుగలేదు పారమార్థికమైన - పనులు చేయగలేదు భిక్ష మొక్కనికైన - బెట్టలేదు జ్ఞానవంతులకైన - బూని మ్రొక్కగలేదు ఇతర దానములైన - నియ్యలేదు
తే. నళినదళనేత్ర । నిన్ను నే - నమ్మినాను జేరి రక్షింపవే నన్ను - శీఘ్రముగను. భూషణవికాస । శ్రీధర్మ - పురనివాస । దుష్టసంహార । నరసింహ - దురితదూర ।
044 సీ. అడవిపక్షుల కెవ్వ - డాహార మిచ్చెను మృగజాతి కెవ్వడు - మేతబెట్టె వనచరాదులకు భో - జన మెవ్వ డిప్పించె జెట్ల కెవ్వడు నీళ్ళు - చేదిపోసె స్త్రీలగర్భంబున - శిశువు నెవ్వడు పెంచె ఫణుల కెవ్వడు పోసె - బరగ బాలు మధుపాళి కెవ్వడు - మకరంద మొనరించె బసుల మెవ్వ డొసంగె - బచ్చిపూరి
తే. జీవకోట్లను బోషింప - నీవెకాని వేఱె యొక దాత లేడయ్య - వెదకిచూడ. భూషణవికాస । శ్రీధర్మ - పురనివాస । దుష్టసంహార । నరసింహ - దురితదూర ।
045 సీ. దనుజారి । నావంటి - దాసజాలము నీకు కోటి సంఖ్య గలారు - కొదువ లేదు బంట్లసందడివల్ల - బహుపరాకై నన్ను మఱచి పోకుము భాగ్య - మహిమచేత దండిగా భ్రుత్యులు - దగిలి నీకుండంగ బక్కబం టేపాటి - పనికి నగును? నీవు మెచ్చెడి పనుల్ - నేను జేయగలేక యింత వృథాజన్మ - మెత్తినాను
తే. భూజనులలోన నే నప్ర - యోజకుడను గనుక నీ సత్కటాక్షంబు - గలుగజేయు. భూషణవికాస । శ్రీధర్మ - పురనివాస । దుష్టసంహార । నరసింహ - దురితదూర ।
046 సీ. కమలలోచన । నన్ను - గన్నతండ్రివిగాన నిన్ను నేమఱకుంటి - నేను విడక యుదరపోషణకునై - యొకరి నే నాశింప నేర నా కన్నంబు - నీవు నడపు పెట్టలే నంటివా - పిన్న పెద్దలలోన దగవు కిప్పుడు దీయ - దలచినాను ధనము భారంబైన - దలకిరీటము నమ్ము కుండలంబులు పైడి - గొలుసు లమ్ము
తే. కొసకు నీ శంఖ చక్రముల్ - కుదువబెట్టి గ్రాసము నొసంగి పోషించు - కపటముడిగి. భూషణవికాస । శ్రీధర్మ - పురనివాస । దుష్టసంహార । నరసింహ - దురితదూర ।
047 సీ. కువలయశ్యామ । నీ - కొలువు చేసిన నాకు జీత మెందుకు ముట్ట - జెప్పవైతి మంచిమాటలచేత - గొంచెమియ్యగలేవు కలహమౌ నిక జుమ్మి - ఖండితముగ నీవు సాధువు గాన - నింత పర్యంతంబు చనవుచే నిన్నాళ్లు - జరుపవలసె నిక నే సహింప నీ - విపుడు నన్నేమైన శిక్ష చేసిన జేయు - సిద్ధమయితి
తే. నేడు కరుణింపకుంటివా - నిశ్చయముగ దెగబడితి చూడు నీతోడ - జగడమునకు. భూషణవికాస । శ్రీధర్మ - పురనివాస । దుష్టసంహార । నరసింహ - దురితదూర ।
048 సీ. హరి । నీకు బర్యంక - మైన శేషుడు చాల బవనము భక్షించి - బ్రతుకుచుండు ననువుగా నీకు వా - హనమైన ఖగరాజు గొప్పపామును నోట - గొఱుకుచుండు అదిగాక నీ భార్య - యైన లక్ష్మీదేవి దినము పేరంటంబు - దిరుగుచుండు నిన్ను భక్తులు పిల్చి - నిత్యపూజలు చేసి ప్రేమ బక్వాన్నముల్ - పెట్టుచుండ్రు
తే. స్వస్థముగ నీకు గ్రాసము - జరుగుచుండు గాసు నీ చేతి దొకటైన - గాదు వ్యయము. భూషణవికాస । శ్రీధర్మ - పురనివాస । దుష్టసంహార । నరసింహ - దురితదూర ।
049 సీ. పుండరీకాక్ష । నా - రెండు కన్నుల నిండ నిన్ను జూచెడి భాగ్య - మెన్నడయ్య వాసిగా నా మనో - వాంఛ దీరెడునట్లు సొగసుగా నీరూపు - చూపవయ్య పాపకర్ముని కంట - బడకపోవుదమంచు బరుషమైన ప్రతిజ్ఞ - బట్టినావె? వసుధలో బతిత పా - వనుడ వీ వంచు నే బుణ్యవంతులనోట - బొగడ వింటి
తే. నేమిటికి విస్తరించె నీ - కింత కీర్తి ద్రోహినైనను నా కీవు - దొరకరాదె? భూషణవికాస । శ్రీధర్మ - పురనివాస । దుష్టసంహార । నరసింహ - దురితదూర ।
050 సీ. పచ్చి చర్మపు దిత్తి - పసలేదు దేహంబు లోపల నంతట - రోయ రోత నరములు శల్యముల్ - నవరంధ్రములు రక్త మాంసంబు కండలు - మైల తిత్తి బలువైన యెండ వా - నల కోర్వ దింతైన దాళలే దాకలి - దాహములకు సకల రోగములకు - సంస్థానమె యుండు నిలువ దస్థిరమైన - నీటిబుగ్గ
తే. బొందిలో నుండు ప్రాణముల్ - పోయినంత గాటికే గాని కొఱగాదు - గవ్వకైన. భూషణవికాస । శ్రీధర్మ - పురనివాస । దుష్టసంహార । నరసింహ - దురితదూర ।
051 సీ. పలురోగములకు నీ - పాదతీరమె కాని వలపు మందులు నాకు - వలదు వలదు చెలిమి సేయుచు నీకు - సేవ జేసెద గాన నీ దాసకోటిలో - నిలుపవయ్య గ్రహభయంబునకు జ - క్రము దలచెదగాని ఘోరరక్షలు గట్ట - గోరనయ్య పాముకాటుకు నిన్ను - భజన జేసెదగాని దాని మంత్రము నేను - తలపనయ్య
తే. దొరికితివి నాకు దండి వై - ద్యుడవు నీవు వేయికష్టాలు వచ్చినన్ - వెఱవనయ్య. భూషణవికాస । శ్రీధర్మ - పురనివాస । దుష్టసంహార । నరసింహ - దురితదూర ।
052 సీ. కూటికోసరము నే - గొఱగాని జనులచే బలుగద్దరింపులు - పడగవలసె? దార సుత భ్రమ - దగిలియుండగగదా దేశదేశములెల్ల - దిరుగవలసె? బెను దరిద్రత పైని - బెనగియుండగగదా చేరి నీచులసేవ - చేయవలసె? నభిమానములు మది - నంటియుండగగదా పరుల జూచిన భీతి - పడగవలసె?
తే. నిటుల సంసారవారిధి - నీదలేక వేయివిధముల నిన్ను నే - వేడుకొంటి. భూషణవికాస । శ్రీధర్మ - పురనివాస । దుష్టసంహార । నరసింహ - దురితదూర ।
053 సీ. సాధు సజ్జనులతో - జగడమాడిన గీడు కవులతో వైరంబు - గాంచ గీడు పరమ దీనుల జిక్క - బట్టి కొట్టిన గీడు భిక్షగాండ్రను దుఃఖ - పెట్ట గీడు నిరుపేదలను జూచి - నిందజేసిన గీడు పుణ్యవంతుల దిట్ట - బొసగు గీడు సద్భక్తులను దిర - స్కారమాడిన గీడు గురుని ద్రవ్యము దోచు - కొనిన గీడు
తే. దుష్టకార్యము లొనరించు - దుర్జనులకు ఘనతరంబైన నరకంబు - గట్టిముల్లె. భూషణవికాస । శ్రీధర్మ - పురనివాస । దుష్టసంహార । నరసింహ - దురితదూర ।
054 సీ. పరులద్రవ్యముమీద - భ్రాంతి నొందినవాడు పరకాంతల నపేక్ష - పడెడువాడు అర్థుల విత్తంబు - లపహరించెడువాడు దానమియ్యంగ వ - ద్దనెడివాడు సభలలోపల నిల్చి - చాడిచెప్పెడివాడు పక్షపు సాక్ష్యంబు - పలుకువాడు విష్ణుదాసుల జూచి - వెక్కిరించెడివాడు ధర్మసాధుల దిట్ట - దలచువాడు
తే. ప్రజల జంతుల హింసించు - పాతకుండు కాలకింకర గదలచే - గష్టమొందు. భూషణవికాస । శ్రీధర్మ - పురనివాస । దుష్టసంహార । నరసింహ - దురితదూర ।
055 సీ. నరసింహ । నా తండ్రి - నన్నేలు నన్నేలు కామితార్థము లిచ్చి - కావు కావు దైత్యసంహార । చాల - దయయుంచు దయయుంచు దీనపోషక । నీవె - దిక్కు దిక్కు రత్నభూషితవక్ష । - రక్షించు రక్షించు భువనరక్షక । నన్ను - బ్రోవు బ్రోవు మారకోటిసురూప । - మన్నించు మన్నించు పద్మలోచన । చేయి - పట్టు పట్టు
తే. సురవినుత । నేను నీచాటు - జొచ్చినాను నా మొఱాలించి కడతేర్చు - నాగశయన । భూషణవికాస । శ్రీధర్మ - పురనివాస । దుష్టసంహార । నరసింహ - దురితదూర ।
056 సీ. నీ భక్తులను గనుల్ - నిండ జూచియు రెండు చేతుల జోహారు - సేయువాడు నేర్పుతో నెవరైన - నీ కథల్ చెప్పంగ వినయమందుచు జాల - వినెడువాడు తన గృహంబునకు నీ - దాసులు రా జూచి పీటపై గూర్చుండ - బెట్టువాడు నీసేవకుల జాతి - నీతు లెన్నక చాల దాసోహ మని చేర - దలచువాడు
తే. పరమభక్తుండు ధన్యుండు - భానుతేజ । వాని గనుగొన్న బుణ్యంబు - వసుధలోన. భూషణవికాస । శ్రీధర్మ - పురనివాస । దుష్టసంహార । నరసింహ - దురితదూర ।
057 సీ. పక్షివాహన । నేను - బ్రతికినన్నిదినాలు కొండెగాండ్రను గూడి - కుమతినైతి నన్నవస్త్రము లిచ్చి - యాదరింపుము నన్ను గన్నతండ్రివి నీవె - కమలనాభ । మరణ మయ్యెడినాడు - మమతతో నీయొద్ది బంట్ల దోలుము ముందు - బ్రహ్మజనక । ఇనజభటావళి - యీడిచికొనిపోక కరుణతో నాయొద్ద - గావ లుంచు
తే. కొసకు నీ సన్నిధికి బిల్చు - కొనియు నీకు సేవకుని జేసికొనవయ్య - శేషశయన । భూషణవికాస । శ్రీధర్మ - పురనివాస । దుష్టసంహార । నరసింహ - దురితదూర ।
058 సీ. నిగమాదిశాస్త్రముల్ - నేర్చిన ద్విజుడైన యజ్ఞకర్తగు సోమ - యాజియైన ధరణిలోపల బ్రభా - త స్నానపరుడైన నిత్యసత్కర్మాది - నిరతుడైన నుపవాస నియమంబు - లొందు సజ్జనుడైన గావివస్త్రముగట్టు - ఘనుడునైన దండిషోడశమహా - దానపరుండైన సకల యాత్రలు సల్పు - సరసుడైన
తే. గర్వమున గష్టపడి నిన్ను - గానకున్న మోక్షసామ్రాజ్య మొందడు - మోహనాంగ । భూషణవికాస । శ్రీధర్మ - పురనివాస । దుష్టసంహార । నరసింహ - దురితదూర ।
059 సీ. పంజరంబున గాకి - బట్టి యుంచిన లెస్స పలుకునే వింతైన - చిలుకవలెను? గార్దభంబును దెచ్చి - కళ్లెమింపుగవేయ దిరుగునే గుర్రంబు - తీరుగాను? ఎనుపపోతును మావ - టీ డు శిక్షించిన నడచునే మదవార - ణంబువలెను? పెద్దపిట్టను మేత - బెట్టి పెంచిన గ్రొవ్వి సాగునే వేటాడు - డేగవలెను?
తే. కుజనులను దెచ్చి నీ సేవ - కొఱకు బెట్ట వాంఛతో జేతురే భక్త - వరులవలెను? భూషణవికాస । శ్రీధర్మ - పురనివాస । దుష్టసంహార । నరసింహ - దురితదూర ।
060 సీ. నీకు దాసుడ నంటి - నిన్ను నమ్ముకయుంటి గాన నాపై నేడు - కరుణజూడు దోసిలొగ్గితి నీకు - ద్రోహ మెన్నగబోకు పద్మలోచన । నేను - పరుడగాను భక్తి నీపై నుంచి - భజన జేసెద గాని పరుల వేడను జుమ్మి - వరము లిమ్ము దండిదాతవు నీవు - తడవుసేయక కావు ఘోరపాతకరాశి - గొట్టివైచి
తే. శీఘ్రముగ గోర్కు లీడేర్చు - చింత దీర్చు నిరతముగ నన్ను బోషించు - నెనరు నుంచు. భూషణవికాస । శ్రీధర్మ - పురనివాస । దుష్టసంహార । నరసింహ - దురితదూర ।
061 సీ. విద్య నేర్చితి నంచు - విర్రవీగగలేదు భాగ్యవంతుడ నంచు - బలుకలేదు ద్రవ్యవంతుడ నంచు - దఱచు నిక్కగలేదు నిరతదానములైన - నెఱపలేదు పుత్రవంతుడ నంచు - బొగడుచుండగలేదు భ్రుత్యవంతుడ నంచు - బొగడలేదు శౌర్యవంతుడ నంచు - సంతసింపగలేదు కార్యవంతుడ నంచు - గడపలేదు
తే. నలుగురికి మెప్పుగానైన - నడువలేదు నళినదళనేత్ర । నిన్ను నే - నమ్మినాను. భూషణవికాస । శ్రీధర్మ - పురనివాస । దుష్టసంహార । నరసింహ - దురితదూర ।
062 సీ. అతిలోభులను భిక్ష - మడుగబోవుట రోత తనద్రవ్య మొకరింట - దాచ రోత గుణహీను డగువాని - కొలువు గొల్చుట రోత యొరుల పంచలక్రింద - నుండ రోత భాగ్యవంతునితోడ - బంతమాడుట రోత గుఱిలేని బంధుల - గూడ రోత ఆదాయములు లేక - యప్పుదీయుట రోత జార చోరుల గూడి - చనుట రోత
తే. యాదిలక్ష్మీశ । నీబంట - నైతినయ్య । యింక నెడబాసి జన్మంబు - లెత్త రోత. భూషణవికాస । శ్రీధర్మ - పురనివాస । దుష్టసంహార । నరసింహ - దురితదూర ।
063 సీ. వెర్రివానికి నేల - వేదాక్షరంబులు? మోటువానికి మంచి - పాట లేల? పసులకాపరి కేల - పరతత్త్వబోధలు? విటకాని కేటికో - విష్ణుకథలు? వదరు శుంఠల కేల - వ్రాత పుస్తకములు? తిరుగు ద్రిమ్మరి కేల - దేవపూజ? ద్రవ్యలోభికి నేల - ధాతృత్వ గుణములు? దొంగబంటుకు మంచి - సంగ తేల?
తే. క్రూరజనులకు నీమీద - గోరి కేల? ద్రోహి పాపాత్మునకు దయా - దుఃఖ మేల? భూషణవికాస । శ్రీధర్మ - పురనివాస । దుష్టసంహార । నరసింహ - దురితదూర ।
064 సీ. నా తండ్రి నాదాత - నాయిష్టదైవమా నన్ను మన్ననసేయు - నారసింహ । దయయుంచు నామీద - దప్పులన్ని క్షమించు నిగమగోచర । నాకు - నీవె దిక్కు నే దురాత్ముడ నంచు - నీమనంబున గోప గింపబోకుము స్వామి । - కేవలముగ ముక్తిదాయక నీకు - మ్రొక్కినందుకు నన్ను గరుణించి రక్షించు - కమలనాభ ।
తే. దండిదొర వంచు నీవెంట - దగిలినాను నేడు ప్రత్యక్షమై నన్ను - నిర్వహింపు. భూషణవికాస । శ్రీధర్మ - పురనివాస । దుష్టసంహార । నరసింహ - దురితదూర ।
065 సీ. వేమాఱు నీకథల్ - వినుచు నుండెడివాడు పరుల ముచ్చటమీద - భ్రాంతి పడడు అగణితంబుగ నిన్ను - బొగడ నేర్చినవాడు చెడ్డమాటలు నోట - జెప్పబోడు ఆసక్తిచేత ని - న్ననుసరించెడివాడు ధనమదాంధులవెంట - దగుల బోడు సంతసంబున నిన్ను - స్మరణజేసెడివాడు చెలగి నీచులపేరు - దలపబోడు
తే. నిన్ను నమ్మిన భక్తుండు - నిశ్చయముగ గోరి చిల్లర వేల్పుల - గొల్వబోడు. భూషణవికాస । శ్రీధర్మ - పురనివాస । దుష్టసంహార । నరసింహ - దురితదూర ।
066 సీ. నే నెంత వేడిన - నీ కేల దయరాదు? పలుమాఱు పిలిచిన - బలుక వేమి? పలికిన నీ కున్న - పద వేమిబోవు? నీ మోమైన బొడచూప - వేమి నాకు? శరణు జొచ్చినవాని - సవరింపవలె గాక పరిహరించుట నీకు - బిరుదు గాదు నీదాసులను నీవు - నిర్వహింపక యున్న బరు లెవ్వ రగుదురు - పంకజాక్ష ।
తే. దాత దైవంబు తల్లియు - దండ్రి వీవె నమ్మియున్నాను నీపాద - నళినములను. భూషణవికాస । శ్రీధర్మ - పురనివాస । దుష్టసంహార । నరసింహ - దురితదూర ।
067 సీ. వేదముల్ చదివెడు - విప్రవర్యుండైన రణము సాధించెడు - రాజెయైన వర్తకకృషికుడౌ - వైశ్యముఖ్యుండైన బరిచగించెడు శూద్ర - వర్యుడయిన మెచ్చుఖడ్గము బట్టి - మెఱయు మ్లేచ్ఛుండైన బ్రజల కక్కఱపడు - రజకుడైన చర్మ మమ్మెడి హీన - చండాలనరుడైన నీ మహీతలమందు - నెవ్వడైన
తే. నిన్ను గొనియాడుచుండెనా - నిశ్చయముగ వాడు మోక్షాధికారి యీ - వసుధలోన. భూషణవికాస । శ్రీధర్మ - పురనివాస । దుష్టసంహార । నరసింహ - దురితదూర ।
068 సీ. సకలవిద్యలు నేర్చి - సభ జయింపగవచ్చు శూరుడై రణమందు - బోరవచ్చు రాజరాజై పుట్టి - రాజ్య మేలగవచ్చు హేమ గోదానంబు - లియ్యవచ్చు గగనమం దున్న చు - క్కల నెంచగావచ్చు జీవరాసుల పేళ్లు - చెప్పవచ్చు నష్టాంగయోగము - లభ్యసింపగవచ్చు మేక రీతిగ నాకు - మెసవవచ్చు
తే. తామరసగర్భ హర పురం - దరులకైన నిన్ను వర్ణింప దరమౌనె - నీరజాక్ష । భూషణవికాస । శ్రీధర్మ - పురనివాస । దుష్టసంహార । నరసింహ - దురితదూర ।
069 సీ. నరసింహ । నీవంటి - దొరను సంపాదించి కుమతి మానవుల నే - గొల్వజాల నెక్కు వైశ్వర్యంబు - లియ్యలేకున్నను బొట్టకుమాత్రము - పోయరాదె? ఘనముగా దిది నీకు - కరవున బోషింప గష్ట మెంతటి స్వల్ప - కార్యమయ్య? పెట్టజాలక యేల - భిక్షమెత్తించెదు నన్ను బీదను జేసి - నా వదేమి?
తే. అమల । కమలాక్ష । నే నిట్లు - శ్రమపడంగ గన్నులకు బండువై నీకు - గానబడునె? భూషణవికాస । శ్రీధర్మ - పురనివాస । దుష్టసంహార । నరసింహ - దురితదూర ।
070 సీ. వనరుహనాభ । నీ - వంక జేరితి నేను గట్టిగా నను గావు - కావు మనుచు వచ్చినందుకు వేగ - వరము లియ్యకకాని లేవబోయిన నిన్ను - లేవనియ్య గూర్చుండబెట్టి నీ - కొంగు గట్టిగ బట్టి పుచ్చుకొందును జూడు - భోగిశయన । యీవేళ నీ కడ్డ - మెవరు వచ్చినగాని వారికైనను లొంగి - వడకబోను
తే. గోపగాడను నీవు నా - గుణము తెలిసి యిప్పుడే నన్ను రక్షించి - యేలుకొమ్ము. భూషణవికాస । శ్రీధర్మ - పురనివాస । దుష్టసంహార । నరసింహ - దురితదూర ।
071 సీ. ప్రహ్లాదు డేపాటి - పైడి కానుక లిచ్చె? మదగజం బెన్నిచ్చె - మౌక్తికములు? నారదుం డెన్నిచ్చె - నగలు రత్నంబు? ల హల్య నీ కే యగ్ర - హార మిచ్చె? ఉడుత నీ కేపాటి - యూడిగంబులు చేసె? ఘనవిభీషణు డేమి - కట్న మిచ్చె? పంచపాండవు లేమి - లంచ మిచ్చిరి నీకు? ద్రౌపది నీ కెంత - ద్రవ్య మిచ్చె?
తే. నీకు వీరంద ఱయినట్లు - నేను గాన? యెందు కని నన్ను రక్షింప - విందువదన । భూషణవికాస । శ్రీధర్మ - పురనివాస । దుష్టసంహార । నరసింహ - దురితదూర ।
072 సీ. వాంఛతో బలిచక్ర - వర్తిదగ్గర జేరి భిక్షమెత్తితి వేల - బిడియపడక? యడవిలో శబరి ది - య్యని ఫలా లందియ్య జేతులొగ్గితి వేల - సిగ్గుపడక? వేడ్కతో వేవేగ - విదురునింటికి నేగి విందుగొంటి వదేమి - వెలితిపడక? అడుకు లల్పము కుచే - లుడు గడించుక తేర బొక్కసాగితి వేల - లెక్కగొనక?
తే. భక్తులకు నీవు పెట్టుట - భాగ్యమౌను వారి కాశించితివి తిండి - వాడ వగుచు. భూషణవికాస । శ్రీధర్మ - పురనివాస । దుష్టసంహార । నరసింహ - దురితదూర ।
073 సీ. స్తంభమం దుదయించి - దానవేంద్రుని ద్రుంచి కరుణతో బ్రహ్లాదు - గాచినావు మకరిచే జిక్కి సా - మజము దుఃఖించంగ గృపయుంచి వేగ ర - క్షించినావు శరణంచు నా విభీ - షణుడు నీ చాటున వచ్చినప్పుడె లంక - నిచ్చినావు ఆ కుచేలుడు చేరె - డటుకు లర్పించిన బహుసంపదల నిచ్చి - పంపినావు
తే. వారివలె నన్ను బోషింప - వశముగాదె? యంత వలపక్ష మేల శ్రీ - కాంత । నీకు? భూషణవికాస । శ్రీధర్మ - పురనివాస । దుష్టసంహార । నరసింహ - దురితదూర ।
074 సీ. వ్యాసు డే కులమందు - వాసిగా జన్మించె? విదురు డే కులమందు - వృద్ధి బొందె? గర్ణు డేకులమందు - ఘనముగా వర్ధిల్లె? నా వసిష్ఠుం డెందు - నవతరించె? నింపుగా వాల్మీకి - యే కులంబున బుట్టె? గుహు డను పుణ్యు డే - కులమువాడు? శ్రీశుకు డెక్కట - జెలగి జన్మించెను? శబరి యేకులమందు - జన్మమొందె?
తే. నే కులంబున వీ రింద - ఱెచ్చినారు? నీకృపాపాత్రులకు జాతి - నీతు లేల? భూషణవికాస । శ్రీధర్మ - పురనివాస । దుష్టసంహార । నరసింహ - దురితదూర ।
075 సీ. వసుధాస్థలంబున - వర్ణహీనుడు గాని బహుళ దురాచార - పరుడు గాని తడసి కాసియ్యని - ధర్మశూన్యుడు గాని చదువనేరని మూఢ - జనుడు గాని సకలమానవులు మె - చ్చని కృతఘ్నుడు గాని చూడ సొంపును లేని - శుంఠ గాని అప్రతిష్ఠలకు లో - నైన దీనుడు గాని మొదటి కే మెఱుగని - మోటు గాని
తే. ప్రతిదినము నీదు భజనచే - బరగునట్టి వాని కే వంక లేదయ్య - వచ్చు ముక్తి. భూషణవికాస । శ్రీధర్మ - పురనివాస । దుష్టసంహార । నరసింహ - దురితదూర ।
076 సీ. ఇభకుంభములమీది - కెగిరెడి సింగంబు ముట్టునే కుఱుచైన - మూషకమును? నవచూతపత్రముల్ - నమలుచున్న పికంబు గొఱుకునే జిల్లేడు - కొనలు నోట? అరవిందమకరంద - మనుభవించెడి తేటి పోవునే పల్లేరు - పూలకడకు? లలిత మైన రసాల - ఫలము గోరెడి చిల్క మెసవునే భమత ను - మ్మెత్తకాయ?
తే. నిలను నీకీర్తనలు పాడ - నేర్చినతడు పరులకీర్తన బాడునే - యరసి చూడ? భూషణవికాస । శ్రీధర్మ - పురనివాస । దుష్టసంహార । నరసింహ - దురితదూర ।
077 సీ. సర్వేశ । నీపాద - సరసిజద్వయమందు జిత్త ముంపగలేను - జెదరకుండ నీవైన దయయుంచి - నిలిచి యుండెడునట్లు చేరి నన్నిపు డేలు - సేవకుడను వనజలోచన । నేను - వట్టి మూర్ఖుడ జుమ్మి నీస్వరూపము జూడ - నేర్పు వేగ తన కుమారున కుగ్గు - తల్లి వోసినయట్లు భక్తిమార్గం బను - పాలు పోసి
తే. ప్రేమతో నన్ను బోషించి - పెంచుకొనుము ఘనత కెక్కించు నీదాస - గణములోన. భూషణవికాస । శ్రీధర్మ - పురనివాస । దుష్టసంహార । నరసింహ - దురితదూర ।
078 సీ. జీమూతవర్ణ । నీ - మోముతో సరిరాక కమలారి యతికళం - కమును బడసె సొగసైన నీ నేత్ర - యుగముతో సరిరాక నళినబృందము నీళ్ల - నడుమ జేరె గరిరాజవరద । నీ - గళముతో సరిరాక పెద్దశంఖము బొబ్బ - పెట్ట బొడగె శ్రీపతి । నీదివ్య - రూపుతో సరి రాక పుష్పబాణుడు నీకు - బుత్రు డయ్యె
తే. నిందిరాదేవి నిన్ను మో - హించి విడక నీకు బట్టమహిషి యయ్యె - నిశ్చయముగ. భూషణవికాస । శ్రీధర్మ - పురనివాస । దుష్టసంహార । నరసింహ - దురితదూర ।
079 సీ. హరిదాసులను నింద - లాడకుండిన జాలు సకల గ్రంథమ్ములు - చదివినట్లు భిక్ష మియ్యంగ ద - ప్పింపకుండిన జాలు జేముట్టి దానంబు - చేసినట్లు మించి సజ్జనుల వం - చించకుండిన జాలు నింపుగా బహుమాన - మిచ్చినట్లు దేవాగ్రహారముల్ - దీయకుండిన జాలు గనకకంబపు గుళ్లు - గట్టినట్లు
తే. ఒకరి వర్శాశనము ముంచ - కున్న జాలు బేరుకీర్తిగ సత్రముల్ - పెట్టినట్లు. భూషణవికాస । శ్రీధర్మ - పురనివాస । దుష్టసంహార । నరసింహ - దురితదూర ।
080 సీ. ఇహలోకసౌఖ్యము - లిచ్చగించెద మన్న దేహ మెప్పటికి దా - స్థిరత నొంద దాయుష్య మున్న ప - ర్యంతంబు పటుతయు నొక్కతీరున నుండ - దుర్విలోన బాల్యయువత్వదు - ర్బలవార్ధకము లను మూటిలో మునిగెడి - ముఱికికొంప భ్రాంతితో దీని గా - పాడుద మనుమొన్న గాలమృత్యువుచేత - గోలుపోవు
తే. నమ్మరా దయ్య । యిది మాయ - నాటకంబు జన్మ మిక నొల్ల న న్నేలు - జలజనాభ । భూషణవికాస । శ్రీధర్మ - పురనివాస । దుష్టసంహార । నరసింహ - దురితదూర ।
081 సీ. వదనంబు నీనామ - భజన గోరుచునుండు జిహ్వ నీకీర్తనల్ - సేయ గోరు హస్తయుగ్మంబు ని - న్నర్చింప గోరును గర్ణముల్ నీ మీది - కథలు గోరు తనువు నీసేవయే - ఘనముగా గోరును నయనముల్ నీదర్శ - నంబు గోరు మూర్ధమ్ము నీపద - మ్ముల మ్రొక్కగా గోరు నాత్మ నీదై యుండు - నరసి చూడ
తే. స్వప్నమున నైన నేవేళ - సంతతమును బుద్ధి నీ పాదములయందు - బూనియుండు. భూషణవికాస । శ్రీధర్మ - పురనివాస । దుష్టసంహార । నరసింహ - దురితదూర ।
082 సీ. పద్మాక్ష । మమతచే - బరము నందెద మంచు విర్రవీగుదుమయ్య - వెర్రిపట్టి మాస్వతంత్రంబైన - మదము గండ్లకు గప్పి మొగము పట్టదు కామ - మోహమునను బ్రహ్మదేవుండైన - బైడిదేహము గల్గ జేసివేయక మమ్ము - జెఱిచె నతడు తుచ్ఛమైనటువంటి - తో లెమ్ముకలతోడి ముఱికి చెత్తలు చేర్చి - మూట కట్టె
తే. నీ శరీరాలు పడిపోవు - టెఱుగ కేము కాముకుల మైతి మిక మిమ్ము - గానలేము. భూషణవికాస । శ్రీధర్మ - పురనివాస । దుష్టసంహార । నరసింహ - దురితదూర ।
083 సీ. గరుడవాహన । దివ్య - కౌస్తుభాలంకార । రవికోటితేజ । సా - రంగవదన । మణిగణాన్విత । హేమ - మకుటాభరణ । చారు మకరకుండల । లస - న్మందహాస । కాంచనాంబర । రత్న - కాంచివిభూషిత । సురవరార్చిత । చంద్ర - సూర్యనయన । కమలనాభ । ముకుంద । - గంగాధరస్తుత । రాక్షసాంతక । నాగ - రాజశయన ।
తే. పతితపావన । లక్షీశ । - బ్రహ్మజనక । భక్తవత్సల । సర్వేశ । - పరమపురుష । భూషణవికాస । శ్రీధర్మ - పురనివాస । దుష్టసంహార । నరసింహ - దురితదూర ।
084 సీ. పలుమాఱు దశరూప - ములు దరించితి వేల? యేకరూపము బొంద - వేల నీవు? నయమున క్షీరాబ్ధి - నడుమ జేరితి వేల? రత్నకాంచన మంది - రములు లేవె? పన్నగేంద్రునిమీద - బవ్వళించితి వేల? జలతారుపట్టెమం - చములు లేవె? ఱెక్కలు గలపక్షి - నెక్కసాగితి వేల? గజతురంగాందోళి - కములు లేవె?
తే. వనజలోచన । యిటువంటి - వైభవములు సొగసుగా నీకు దోచెనో - సుందరాంగ? భూషణవికాస । శ్రీధర్మ - పురనివాస । దుష్టసంహార । నరసింహ - దురితదూర ।
085 సీ. తిరుపతి స్థలమందు - దిన్నగా నే నున్న వేంకటేశుడు మేత - వేయలేడొ? పురుషోత్తమమున కే - బోయనజాలు జ గన్నాథు డన్నంబు - గడపలేడొ? శ్రీరంగమునకు నే - జేర బోయిన జాలు స్వామి గ్రాసము బెట్టి - సాకలేడొ? కాంచీపురములోన - గదిసి నే గొలువున్న గరివరదుడు పొట్ట - గడపలేడొ?
తే. యెందు బోవక నేను నీ - మందిరమున నిలిచితిని నీకు నామీద - నెనరు లేదు. భూషణవికాస । శ్రీధర్మ - పురనివాస । దుష్టసంహార । నరసింహ - దురితదూర ।
086 సీ. తార్క్ష్యవాహన । నీవు - దండిదాత వటంచు గోరి వేడుక నిన్ను - గొల్వవచ్చి యర్థిమార్గమును నే - ననుసరించితినయ్య లావైన బదునాల్గు - లక్ష లైన వేషముల్ వేసి నా - విద్యాప్రగల్భత జూపసాగితి నీకు - సుందరాంగ । యానంద మైన నే - నడుగ వచ్చిన దిచ్చి వాంఛ దీర్పుము - నీలవర్ణ । వేగ
తే. నీకు నావిద్య హర్షంబు - గాక యున్న తేపతేపకు వేషముల్ - దేను సుమ్మి. భూషణవికాస । శ్రీధర్మ - పురనివాస । దుష్టసంహార । నరసింహ - దురితదూర ।
087 సీ. అమరేంద్రవినుత । నే - నతిదురాత్ముడ నంచు గలలోన నైనను - గనుల బడవు నీవు ప్రత్యక్షమై - నులువకుండిన మానె దొడ్డగా నొక యుక్తి - దొరకెనయ్య । గట్టికొయ్యను దెచ్చి - ఘనముగా ఖండించి నీస్వరూపము చేసి - నిలుపుకొంచు ధూప దీపము లిచ్చి - తులసితో బూజించి నిత్యనైవేద్యముల్ - నేమముగను
తే. నడుపుచును నిన్ను గొలిచెద - నమ్మి బుద్ధి నీ ప్రపంచంబు గలుగు నా - కింతె చాలు. భూషణవికాస । శ్రీధర్మ - పురనివాస । దుష్టసంహార । నరసింహ - దురితదూర ।
088 సీ. భువనేశ । గోవింద । - రవికోటిసంకాశ । పక్షివాహన । భక్త - పారిజాత । యంభోజభవ రుద్ర - జంభారిసన్నుత । సామగానవిలోల । - సారసాక్ష । వనధిగంభీర । శ్రీ - వత్సకౌస్తుభవక్ష । శంఖచక్రగదాసి - శార్జ్ఞహస్త । దీనరక్షక । వాసు - దేవ । దైత్యవినాశ । నారదార్చిత । దివ్య - నాగశయన ।
తే. చారు నవరత్నకుండల - శ్రవణయుగళ । విబుధవందిత పాదబ్జ । - విశ్వరూప । భూషణవికాస । శ్రీధర్మ - పురనివాస । దుష్టసంహార । నరసింహ - దురితదూర ।
089 సీ. నాగేంద్రశయన । నీ - నామమాధుర్యంబు మూడుకన్నుల సాంబ - మూర్తి కెఱుక పంకజాతాక్ష । నీ - బలపరాక్రమ మెల్ల భారతీపతి యైన - బ్రహ్మ కెఱుక మధుకైటభారి । నీ - మాయాసమర్థత వసుధలో బలిచక్ర - వర్తి కెఱుక పరమాత్మ । నీ దగు - పక్షపాతిత్వంబు దశశతాక్షుల పురం - దరుని కెఱుక
తే. వీరి కెఱుకగు నీకథల్ - వింత లెల్ల నరుల కెఱు కన్న నెవరైన - నవ్విపోరె? భూషణవికాస । శ్రీధర్మ - పురనివాస । దుష్టసంహార । నరసింహ - దురితదూర ।
090 సీ. అర్థు లేమైన ని - న్నడుగవచ్చెద రంచు క్షీరసాగరమందు - జేరినావు నీచుట్టు సేవకుల్ - నిలువకుండుటకునై భయదసర్పముమీద - బండినావు భక్తబృందము వెంట - బడి చరించెద రంచు నెగసి పోయెడిపక్షి - నెక్కినావు దాసులు నీద్వార - మాసింపకుంటకు మంచి యోధుల కావ - లుంచినావు
తే. లావు గలవాడ వైతి వే - లాగు నేను నిన్ను జూతును నాతండ్రి । - నీరజాక్ష । భూషణవికాస । శ్రీధర్మ - పురనివాస । దుష్టసంహార । నరసింహ - దురితదూర ।
091 సీ. నీకథల్ చెవులలో - సోకుట మొదలుగా బులకాంకురము మెన - బుట్టువాడు నయమైన నీ దివ్య - నామకీర్తనలోన మగ్నుడై దేహంబు - మఱచువాడు ఫాలంబుతో నీదు - పాదయుగ్మమునకు బ్రేమతో దండ మ - ర్పించువాడు హా పుండరీకాక్ష । - హా రామ । హరి । యంచు వేడ్కతో గేకలు - వేయువాడు
తే. చిత్తకమలంబునను నిన్ను - జేర్చువాడు నీదులోకంబునం దుండు - నీరజాక్ష । భూషణవికాస । శ్రీధర్మ - పురనివాస । దుష్టసంహార । నరసింహ - దురితదూర ।
092 సీ. నిగమగోచర । నేను - నీకు మెప్పగునట్లు లెస్సగా బూజింప - లేను సుమ్మి నాకు దోచిన భూష - ణములు పెట్టెద నన్న గౌస్తుభమణి నీకు - గలదు ముందె భక్ష్యభోజ్యముల న - ర్పణము జేసెద నన్న నీవు పెట్టితి సుధ - నిర్జరులకు గలిమికొద్దిగ గాను - కల నొసంగెద నన్న భార్గవీదేవి నీ - భార్య యయ్యె
తే. నన్ని గలవాడ వఖిల లో - కాధిపతివి । నీకు సొమ్ములు పెట్ట నే - నెంతవాడ । భూషణవికాస । శ్రీధర్మ - పురనివాస । దుష్టసంహార । నరసింహ - దురితదూర ।
093 సీ. నవసరోజదళాక్ష । - నన్ను బోషించెడు దాతవు నీ వంచు - ధైర్యపడితి నా మనంబున నిన్ను - నమ్మినందుకు దండ్రి । మేలు నా కొనరింపు - నీలదేహ । భళిభళీ । నీ యంత - ప్రభువు నెక్కడ జూడ బుడమిలో నీ పేరు - పొగడవచ్చు ముందు జేసిన పాప - మును నశింపగ జేసి నిర్వహింపుము నన్ను - నేర్పుతోడ
తే. బరమసంతోష మాయె నా - ప్రాణములకు నీఋణము దీర్చుకొన నేర - నీరజాక్ష । భూషణవికాస । శ్రీధర్మ - పురనివాస । దుష్టసంహార । నరసింహ - దురితదూర ।
094 సీ. ఫణులపుట్టలమీద - బవ్వళించినయట్లు పులుల గుంపున జేర - బోయినట్లు మకరివర్గం బున్న - మడుగు జొచ్చినయట్లు గంగదాపున నిండ్లు - గట్టినట్లు చెదలభూమిని జాప - చేర బఱచినయట్లు ఓటిబిందెల బాల - నునిచినట్లు వెర్రివానికి బహు - విత్త మిచ్చినయట్లు కమ్మగుడిసె మందు - గాల్చినట్లు
తే. స్వామి నీ భక్తవరులు దు - ర్జనులతోడ జెలిమి జేసినయ ట్లైన - జేటు వచ్చు. భూషణవికాస । శ్రీధర్మ - పురనివాస । దుష్టసంహార । నరసింహ - దురితదూర ।
095 సీ. దనుజసంహార । చక్ర - ధర । నీకు దండంబు లిందిరాధిప । నీకు - వందనంబు పతితపావన । నీకు - బహునమస్కారముల్ నీరజాతదళాక్ష । - నీకు శరణు వాసవార్చిత । మేఘ - వర్ణ । నీకు శుభంబు మందరధర । నీకు - మంగళంబు కంబుకంధర । శార్జ్గ - కర । నీకు భద్రంబు దీనరక్షక । నీకు - దిగ్విజయము
తే. సకలవైభవములు నీకు - సార్వభౌమ । నిత్యకల్యాణములు నగు - నీకు నెపుడు. భూషణవికాస । శ్రీధర్మ - పురనివాస । దుష్టసంహార । నరసింహ - దురితదూర ।
096 సీ. మత్స్యావతార మై - మడుగులోపల జొచ్చి సోమకాసురు ద్రుంచి - చోద్యముగను దెచ్చి వేదము లెల్ల - మెచ్చ దేవతలెల్ల బ్రహ్మ కిచ్చితి వీవు - భళి । యనంగ నా వేదముల నియ్య - నాచారనిష్ఠల ననుభవించుచు నుందు - రవనిసురులు సకలపాపంబులు - సమసిపోవు నటంచు మనుజు లందఱు నీదు - మహిమ దెలిసి
తే. యుందు రరవిందనయన । నీ - యునికి దెలియు వారలకు వేగ మోక్షంబు - వచ్చు ననఘ । భూషణవికాస । శ్రీధర్మ - పురనివాస । దుష్టసంహార । నరసింహ - దురితదూర ।
097 సీ. కూర్మావతారమై - కుధరంబుక్రిందను గోర్కితో నుండవా - కొమరు మిగుల? వరహావతారమై - వనభూములను జొచ్చి శిక్షింపవా హిర - ణ్యాక్షు నపుడు? నరసింహమూర్తివై - నరభోజను హిరణ్య కశిపుని ద్రుంపవా - కాంతి మీఱ? వామనరూపమై - వసుధలో బలిచక్ర వర్తి నఱంపవా - వైర ముడిగి?
తే. యిట్టి పను లెల్ల జేయగా - నెవరికేని తగునె నరసింహ । నీకిది - దగును గాక । భూషణవికాస । శ్రీధర్మ - పురనివాస । దుష్టసంహార । నరసింహ - దురితదూర ।
098 సీ. లక్ష్మీశ । నీదివ్య - లక్షణగుణముల వినజాల కెప్పుడు - వెర్రినైతి నా వెర్రిగుణములు - నయముగా ఖండించి నన్ను రక్షింపు మో - నళిననేత్ర । నిన్ను నే నమ్మితి - నితరదైవముల నే నమ్మలే దెప్పుడు - నాగశయన । కాపాడినను నీవె - కష్టపెట్టిన నీవె నీపాదకమలముల్ - నిరత మేను
తే. నమ్మియున్నాను నీపాద - నళినభక్తి వేగ దయచేసి రక్షింపు - వేదవిద్య । భూషణవికాస । శ్రీధర్మ - పురనివాస । దుష్టసంహార । నరసింహ - దురితదూర ।
099 సీ. అమరేంద్రవినుత । ని - న్ననుసరించినవారు ముక్తి బొందిరి వేగ - ముదముతోను నీపాదపద్మముల్ - నెఱ నమ్మియున్నాను నాకు మోక్షం బిమ్ము - నళిననేత్ర । కాచి రక్షించు నన్ - గడతేర్చు వేగమే నీ సేవకుని జేయు - నిశ్చలముగ గాపాడినను నీకు - గైంకర్యపరుడ నై చెలగి నీపనులను - జేయువాడ
తే. ననుచు బలుమాఱు వేడెద - నబ్జనాభ । నాకు బ్రత్యక్ష మగుము నిన్ - నమ్మినాను. భూషణవికాస । శ్రీధర్మ - పురనివాస । దుష్టసంహార । నరసింహ - దురితదూర ।
100 సీ. శేషప్ప యను కవి - చెప్పిన పద్యముల్ చెవుల కానందమై - చెలగుచుండు నే మనుజుండైన - నెలమి నీ శతకంబు భక్తితో విన్న స - త్ఫలము గలుగు జెలగి యీ పద్యముల్ - చేర్చి వ్రాసినవారు కమలాక్షుకరుణను - గాంతు రెపుడు నింపుగా బుస్తకం - బెపుడు బూజించిన దురితజాలంబులు - దొలగిపోవు
తే. నిద్ది పుణ్యాకరం బని - యెపుడు జనులు గషట మెన్నక పఠియింప - గలుగు ముక్తి. భూషణవికాస । శ్రీధర్మ - పురనివాస । దుష్టసంహార । నరసింహ - దురితదూర ।
Browse Related Categories: