Shatakams · Traditional devotional text · Source: vignanam.org (Traditional devotional text (public-domain shlokas))
శా. శ్రీరామామణి పాణిపంకజమృదుశ్రీతజ్ఞ పాదాబ్జ శృం గారాకారశరీర, చారుకరుణాగంభీర, సద్భక్తమం దారాంభోరుహపత్రలోచన కళాధారోరుసంపత్సుధా పారావారవిహార, నా దురితముల్ భంజింపు నారాయణా! 1
మ. కడకుం బాయక వేయినోళ్ళు గల యా కాకోదరాధీశుఁడున్ గడముట్ట న్వినుతింప లేక నిగుడ\న్ గ్రాలంగ నొప్పారు మి మ్మడర\న్ సన్నుతి సేయ నాదువశమే! యజ్ఞాని, లోభాత్ముఁడ\న్ జడుఁడ, న్నజ్ఞుఁడ, నైకజిహ్వుఁడ, జనస్తబ్ధుండ, నారాయణా! 2
శా. నే నీదాసుఁడ నీవు నాపతివి నిన్నే కాని యొండెవ్వరి\న్ ధ్యానింపం బ్రణుతింప నట్లగుటకు న్నా నేర్చు చందంబున\న్ నీ నామస్తుతు లాచరించు నెడల న్నే తప్పులుం గల్గిన\న్ వానిన్ లోఁగొనుమయ్య, తండ్రి, విహితవ్యాపార, నారాయణా! 3
మ. నెరయ న్నిర్మల మైన నీ స్తుతికథానీకంబు పద్యంబులో నొరుగుల్ మిక్కిలి గల్గెనేనియుఁ గడు న్యోగంబె చర్చింపఁగాఁ గుఋగ ణ్పైనను వంకబోయినఁ గడుం గుజ్జైనఁ బేడెత్తినం జెఱకుం గోలకు తీపు గాక కలదే, చే దెందు, నారాయణా! 4
మ. చదువుల్ పెక్కులు సంగ్రహించి పిదపం జాలంగ సుజ్ఞాని యై మదిలోఁ బాయక నిన్ను నిల్పఁ దగు నామర్మంబు వీక్షింపఁడే మొదలం గాడిద చారుగంధవితతుల్ మోవంగ శక్యంబె కా కది సౌరభ్యపరీక్ష జూడ కుశలే యవ్యక్త, నారాయణా! 5
మ. లలిఁ గబ్బంబు కరాట మివ్వసుధ నెల్లం న్మించెఁ బో నీకథా వళి కర్పూరము నించిన న్నితరమౌ వ్యర్ధార్థకామోదముల్ పెలుచం బూనిన యక్కరాటము తుదిన్ బేతేకరాటంబె పో చలదిందీవరపత్రలోచన, ఘనశ్యామాంగ, నారాయణా! 6
మ. మన మార న్నచలేంద్రజాధిపతికి న్మస్తాగ్రమాణిక్యమై మునికోపానలదగ్ధ రాజతతికి న్ముక్తిస్ఫురన్మార్గమై యెనయ\న్ సాయకశాయికిం జననియై యేపారు మిన్నేటికిం జని మూలంబగు నంఘ్రి నాదు మదిలోఁ జర్చింతు, నారాయణా! 7
Offered for worship and study, not as prediction. Non-commercial.
More devotional texts
శా. నీ పుత్రుండు చరాచరప్రతతుల న్నిర్మించి పెంపారఁగా నీ పుణ్యాంగన సర్వజీవతతుల న్నిత్యంబు రక్షింపఁగా నీ పాదోదక మీజగత్త్రయముల న్నిష్పాపులం జేయఁగా నీ పెంపేమని చెప్పవచ్చు సుగుణా నిత్యాత్మ, నారాయణా! 8
శా. బ్రహ్మాండావలిలోన సత్వగుణివై బాహ్యంబునం దాదిమ బ్రహ్మాఖ్యం బరతత్వబోధములకున్ భవ్యాధినాథుండవై బ్రహ్మేంద్రామరవాయుభుక్పతులకు\న్ భావింప రాకున్న నా జిహ్మవ్యాప్తుల నెన్న నాదు వశమే చిద్రూప, నారాయణా! 9
మ. ధర సింహాసనమై నభంబు గొడుగై తద్దేవతల్ భృత్యులై పరమామ్నాయము లెల్ల వందిగణమై బ్రహ్మాండ మాగారమై సిరి భార్యామణియై విరించి కొడుకై శ్రీగంగ సత్పుత్రియై వరుస న్నీ ఘనరాజసంబు నిజమై వర్ధిల్లు, నారాయణా! 10
మ. మగమీనాకృతి వార్ధిఁ జొచ్చి యసురు న్మర్దించి యవ్వేదముల్ మగుడం దెచ్చి విరించి కిచ్చి యతని న్మన్నించి యేపారఁగాఁ బగ సాధించిన దివ్యమూర్తి వని నే భావింతు నెల్లప్పుడున్ ఖగరాజధ్వజ భక్తవత్సల జగత్కారుణ్య, నారాయణా! 11
మ. అమరుల్ రాక్షసనాయకుల్ కడఁకతో నత్యంతసామర్థ్యులై భ్రమరీదండము మందరాచలముగా బాథోనిధిం ద్రచ్చగా దమకించె\న్ భువనత్రయంబును గిరుల్ దంతావళుల్ మ్రొగ్గినం గమఠంబై ధరియించి మించిన జగత్కల్యాణ, నారాయణా! 12
శా. భీమాకారవరాహమై భువనముల్ భీతిల్లి కంపింప ను ద్దామోర్విం గొనిపోయి నీరనిధిలో డాఁగున్న గర్వాంధునిన్ హేమాక్షాసురు వీఁకఁ దాకిఁ జయలక్ష్మి\న్ గారవింపంగ నీ భూమిం దక్షిణదంష్ట్ర నెత్తిన నినుం బూజింతు నారాయణా! 13
శా. స్తంభంబందు నృసింహమై వెడలి యచ్చండాట్టహాసధ్వనుల్ దంభోళిం గడువంగ హేమకశిపోద్దండాసురాధీశ్వరు\న్ శుంభద్గర్భము వ్రచ్చి వాని సుతునిన్ శోభిల్ల మన్నించి య జ్జంభారాతిని బ్రీతిఁ దేల్చిన నినుం జర్చింతు, నారాయణా! 14
మ. మహియు న్నాకసముం బదద్వయ పరీమాణంబుగాఁ బెట్టి యా గ్రహ మొప్పం బలిమస్తకం బొక పదగ్రస్తంబుగా నెమ్మితో విహరించింద్ర విరించి శంకర మహావిర్భూత దివ్యాకృతిన్ సహజంబై వెలసిల్లు వామన లసచ్చారిత్ర, నారాయణా! 15
మ. ధరణిన్ రక్తమహాహ్రదంబు లెలమిం ద్రైలోక్య నిర్దిష్టమై పరగం బైతృక తర్పణంబుకొరకై ప్రఖ్యాతిగాఁ దీవ్రతన్ నిరువై యొక్కటిమారు క్షత్రవరుల న్నేపార నిర్జించి త త్పరశుభ్రాజిత రామనామము కడు\న్ ధన్యంబు, నారాయణా! 16
మ. వరుసం దాటకిఁ జంపి కైశికు మఘ స్వాస్థ్యంబు గావించి శం కరు చాపం బొగిఁ ద్రుంచి జానకిఁ దగం గల్యాణమై తండ్రిపం పరుదారన్ వనభూమి కేఁగి జగదాహ్లాదంబుగా రావణున్ ధరణిం గూల్చిన రామనామము కడు\న్ ధన్యంబు, నారాయణా! 17
మ. యదువంశంబునఁ గృష్ణు కగ్రజుఁడవై యాభీల శౌర్యోన్నతిన్ మదవద్ధేనుక ముష్టికా ద్యసురుల\న్ మర్దించి లీలారసా స్పద కేళీరతి రేవతీవదన కంజాతాంతభృంగం బన\న్ విదితంబౌ బలరామమూర్తివని నిన్ వీక్షింతు, నారాయణా! 18
మ. పురము ల్మూడును మూడులోకములు నేప్రొద్దు న్విదారింపఁ ద త్పురనారీ మహిమోన్నతుల్ సెడుటకై బుద్ధుండవై బుద్ధితో వరబోధద్రుమ సేవఁ జేయుటకునై వారిం బ్రబోధించి య ప్పురముల్ గెల్చిన నీ యుపాయము జగత్పూజ్యంబు, నారాయణా! 19
మ. కలిధర్మంబునఁ బాపసంకలితులై గర్వాంధులై తుచ్ఛులై కులశీలంబులు మాని హేయగతులం గ్రొవ్వారు దుష్టాత్ములం బలిగాఁ జేయఁ దలంచి ధర్మ మెలమిం బాలించి నిల్పంగ మీ వలనం గల్క్యవతార మొందఁగల నిన్ వర్ణింతు నారాయణా! 20
మ. ఇరవొంద\న్ సచరాచరప్రతతుల న్నెన్నంగ శక్యంబు కా కరయ\న్ పద్మభవాండ భాండచయము న్నారంగ మీకుక్షిలో నరుదార న్నుదయించుఁ బెంచు నడఁగు న్నన్నారికేళోద్భవాం తర వాఃపూరము చంద మొంది యెపుడున్ దైత్యారి నారాయణా! 21
మ. దళదిందీవర నీలనీరద సముద్యద్భాసితాకార, శ్రీ లలనా కౌస్తుభచారువక్ష విబుధశ్లాఘోద్భవస్థాన కో మల నాభీచరణారవిందజనితామ్నాయాద్యగంగా! లస జ్జలజాతాయతనేత్ర నిన్ను మదిలోఁ జర్చింతు నారాయణా! 22
మ. జగదాధారక భక్తవత్సల కృపాజన్మాలయాపాంగ! భూ గగనార్కేందుజలాత్మపావక మరుత్కాయా! ప్రదీపప్రయో గి గణస్తుత్య మహాఘనాశన! లసద్గీర్వాణ సంసేవితా! త్రిగుణాతీత! ముకుంద! నాదు మదిలో దీపింపు, నారాయణా! 23
శా. భూతవ్రాతము నంబుజాసనుఁడవై పుట్టింతు విష్ణుండవై ప్రీతిం బ్రోతు హరుండవై చెఋతు నిర్భేద్యుండవై త్రైగుణో పేతంబై పరమాత్మవై నిలుతు నీ పెంపెవ్వరుం గాన ర బ్జాతోద్భూతసుజాతపూజితపదాబ్జశ్రేష్ఠ, నారాయణా! 24
మ. వరనాభీధవళాంబుజోదరమున\న్ వాణీశుఁ గల్పించి య ప్పురుషశ్రేష్ఠుని ఫాలమందు శివునిం బుట్టించి యామేటికిం బరమోత్తంసముగా వియత్తలనదిం బాదంబులం గన్న మీ సరి యెవ్వారలు మీరు దక్కఁగ రమాసాధ్వీశ, నారాయణా! 25
మ. ప్రభ మీనాభి జనించినట్టి విలసత్పద్మోరుసద్మంబునం బ్రభవంబైన విరించి ఫాలజనిత ప్రస్వేదసంభూతుఁడై యభిధానంబును గోరి కాంచెను భవుం డార్యేశు లూహింపఁగా నభవాఖ్యుండవు ని న్నెఋంగవశమే యబ్జాక్ష, నారాయణా! 26
మ. పటుగర్భాంతరగోళభాగమున నీ బ్రహ్మాండభాండంబు ప్రా కట దివ్యాద్భుతలీలఁ దాల్చి మహిమం గల్పాంత మంభోధిపై వటపత్రాగ్రముఁ జెంది యొప్పిన మిము న్వర్ణింపఁగా శక్యమే నిటలాక్షాంబురుహాసనాదికులకు న్నిర్వాణ, నారాయణా! 27
మ. సవిశేషోరు సువర్ణబిందువిలస చ్చక్రాంకలింగాకృతి\న్ భవుచే నుద్ధవుచేఁ బయోజభవుచేఁ బద్మారిచే భానుచే ధ్రువుచే నా దివిజాధినాయకులచే దీప్యన్మునీంద్రాళిచే నవదివ్యార్చన లందుచుందువు రమానారీశ, నారాయణా! 28
మ. సర్వంబున్ వసియించు నీతనువునన్ సర్వంబునం దుండగా సర్వాత్మా! వసియించు దీవని మదిన్ సార్థంబుగాఁ జూచి యా గీర్వాణాదులు వాసుదేవుఁ డనుచున్ గీర్తింతు రేప్రొద్దు నా శీర్వాదంబు భవన్మహామహిమ లక్ష్మీనాథ, నారాయణా! 29
మ. గగనాద్యంచితపంచభూతమయమై కంజాతజాండావలిన్ సగుణబ్రహ్మమయాఖ్యతం దనరుచున్ సంసారివై చిత్కళా సుగుణంబై విలసిల్లు దీవు విపులస్థూలంబు సూక్ష్మంబునై నిగమోత్తంస గుణావతంస సుమహానిత్యాత్మ, నారాయణా! 30
మ. ఎల రారన్ భవదీయనామకథనం బేమర్త్యుచిత్తంబులోఁ బొలుపారం దగిలుండునేని యఘముల్ పొందంగ నె ట్లోపెడు\న్ కలయం బావకుచేతఁ బట్టువడు నక్కాష్ఠంబుపైఁ గీటముల్ నిలువ న్నేర్చునే భక్తపోషణ కృపానిత్యాత్మ, నారాయణా! 31
మ. కలయం దిక్కులు నిండి చండతరమై కప్పారు మేఘౌఘముల్ వెలయ\న్ ఘోరసమీరణస్ఫురణచే వే పాయుచందంబున\న్ జలదంభోళి మృగాగ్నితస్కరరుజాశత్రోరగవ్రాతముల్ దొలఁగు న్మీ దగు దివ్యమంత్రపఠన\న్ దోషఘ్న, నారాయణా! 32
మ. కలుషాగాథవినాశకారి యగుచుం గైవల్యసంధాయియై నలి నొప్పారెడు మంత్రరాజమగు నీనామంబు ప్రేమంబుతో నలర న్నెవ్వని వాక్కునం బొరయదే నన్నీచు ఘోరాత్మయు\న్ వెలయన్ భూరుహకోటరం బదియ సూ వేదాత్మ, నారాయణా! 33
మ. పరమంబై పరతత్వమై సకలసంపత్సారమై భవ్యమై సురసిద్ధోరగయక్ష పక్షిమునిరక్షో హృద్గుహాభ్యంతర స్థిరసుజ్ఞానసుదీపమై శ్రుతికళాసిద్ధాంతమై సిద్ధమై సరి లే కెప్పుడు నీదునామ మమరున్ సత్యంబు, నారాయణా! 34
మ. అధికాఘౌఘ తమోదివాకరమునై యద్రీంద్రజా జిహ్వకున్ సుధయై వేదవినూత్నరత్నములకున్ సూత్రాభిధానంబునై బుధసందోహమనోహరాంకురమునై భూదేవతాకోటికిన్ విధులై మీబహునామరాజి వెలయున్ వేదాత్మ, నారాయణా! 35
మ. పొనర న్ముక్తికిఁ ద్రోవ వేదములకుం బుట్టిల్లు మోదంబునం దునికిస్థానము నిష్టభోగములకు న్నుత్పత్తి యేప్రొద్దును\న్ ఘనపాపంబుల వైరి షడ్రిపులకు\న్ గాలావసానంబు మీ వినుతాంఘ్రిద్వయపద్మసేవన గదా విశ్వేశ, నారాయణా! 36
మ. భవరోగంబుల మందు పాతకతమోబాలార్కబింబంబు క ర్మ విషజ్వాలసుధాంశుగామృత తుషారవ్రాతపాథోధిమూ ర్తివి కైవల్యపదావలోకన కళాదివ్యాంజనశ్రేష్ఠమై భువిలో మీదగు మంత్రరాజ మమరున్ భూతాత్మ, నారాయణా! 37
మ. వరుసన్ గర్మపిపీలికాకృత తనూవల్మీకనాళంబులోఁ బరుషాకారముతో వసించిన మహా పాపోరగశ్రేణికిం బరమోచ్చాటనమై రహస్యమహిమం బాటింపుచు న్నుండు మీ తిరుమంత్రం బగు మంత్రరాజ మమరుం దివ్యాత్మ, నారాయణా! 38
మ. హరుని న్నద్రిజ నాంజనేయుని గుహు న్నయ్యంబరీషున్ ధ్రువుం గరిఁ బ్రహ్లాదు విభీషణాఖ్యుని బలిన్ ఘంటాశ్రవు న్నారదు\న్ గర మొప్ప న్విదురున్ బరాశరసుతున్ గాంగేయుని\న్ ద్రౌపదిన్ నరు నక్రూరునిఁ బాయకుండును భవన్నామంబు, నారాయణా! 39
శా. శ్రీకిన్మందిరమైన వక్షము, సురజ్యేష్ఠోద్భవస్థాన నా భీకంజాతము, చంద్రికాంతర సుధాభివ్యక్త నేత్రంబులు\న్, లోకస్తుత్య మరున్నదీజనక మాలోలాంఘ్రియు\న్ గల్గు నా లోకారాధ్యుఁడ వైన నిన్నెపుడు నాలోఁ జూతు, నారాయణా! 40
శా. విందుల్ విందు లటంచు గోపరమణుల్ వ్రేపల్లెలోఁ బిన్ననాఁ డందెల్ మ్రోయఁగ ముద్దుమోమలర ని న్నాలింగితుం జేయుచో డెందంబుల్ దనివార రాగరసవీటీలీలల\న్ దేల్చు మీ మందస్మేర ముఖేందురోచులు మము న్మన్నించు, నారాయణా! 41
శా. విందు ల్వచ్చిరి మీయశోదకడకు న్వేగంబె పొ మ్మయ్యయో నందానందన! చందనాంకురమ! కృష్ణా! యింకఁబో వేమి మా మందం జాతర సేయఁబోద మిదె రమ్మా యంచు మి మ్మెత్తుకో చందం బబ్బిన నుబ్బకుండుదురె ఘోషస్త్రీలు, నారాయణా! 42
శా. అన్నా కృష్ణమ నేడు వేల్పులకు మీఁదన్నార మీచట్లలో వెన్నల్ ముట్టకు మన్న నాక్షణమున న్విశ్వాకృతిస్ఫూర్తి వై యున్నన్ దిక్కులు చూచుచున్ బెగడి నిన్నోలి న్నుతుల్ సేయుచున్ గన్నుల్ మూయ యశోదకున్ జిఋత వై కన్పింతు, నారాయణా! 43
శా. ఉల్లోలంబులుగాఁ గురుల్ నుదుటిపై నుప్పొంగ మోమెత్తి ధ మ్మిల్లం బల్లలనాడ రాగరససమ్మిశ్రంబుగా నీవు వ్రే పల్లెం దాడుచు గోప గోనివహ గోపస్త్రీల యుల్లంబు మీ పిల్లంగ్రోవిని జుట్టి రాఁ దిగుచు నీ పెంపొప్పు, నారాయణా! 44
మ. కసవొప్పన్ పసి మేసి ప్రొద్దు గలుగం గాంతారముం బాసి య ప్పసియు న్నీవును వచ్చుచో నెదురుగాఁ బైకొన్న గోపాంగనా రసవద్వృత్తపయోధరద్వయ హరిద్రాలేపనామోదముల్ పసిఁ గొంచున్ బసిఁ గొంచు వచ్చుటలు నే భావింతు, నారాయణా! 45
శా. చన్నుల్ మీదిఁకి చౌకళింప నడుముం జవ్వాడ కందర్పసం పన్నాఖ్యంబు నటించు మాడ్కి కబరీభారంబు లూటాడఁగా విన్నాణంబు నటింప గోపజన గోబృందంబుతో వచ్చు మీ వన్నెల్ కన్నుల ముంచి గ్రోలుటలు నే వర్ణింతు, నారాయణా! 46
మ. పెరుగుల్ ద్రచ్చుచు నొక్కగోపిక మిముం బ్రేమంబునం జూచి రా గ రసావేశత రిత్త ద్రచ్చ నిడ నాకవ్వంబు నీవు న్మనో హరలీలం గనుగొంచు ధేను వని యయ్యాబోతునుం బట్టి తీ వరవృత్తాంతము లేను పుణ్యకథగా వర్ణింతు, నారాయణా! 47
శా. కేల\న్ గోలయు గూటిచిక్కము నొగిం గీలించి నెత్తంబునం బీలీపించముఁ జుట్టి నెన్నడుమునం బింఛావళి\న్ గట్టి క ర్ణాలంకార కదంబగుచ్ఛ మధుమత్తాలీస్వనం బొప్ప నీ వాలన్ గాచినభావ మిట్టి దని నే వర్ణింతు, నారాయణా! 48
శా. కాళిందీతటభూమి నాలకదుపుల్ కాలూఁది మేయ\న్ సము త్తాలోల తమాలపాదప శిఖాంతస్థుండవై వేణురం ధ్రాలిన్ రాగరసంబు నిండ విలసద్రాగంబు సంధించి గో పాలవ్రాతము గండుగోయిలలుగా వర్ణింతు, నారాయణా! 49
శా. రాణించెన్ గడు నంచు నీసహచరుల్ రాగిల్లి సోలంగ మీ వేణుక్వాణము వీనులం బడి మనోవీథుల్ బయల్ముట్టఁగా ఘోణాగ్రంబులు మీదిఁ కెత్తుకొని లాంగూలంబు లల్లార్చి గో శ్రేణుల్ చిందులు ద్రొక్కి యాడుటలు నేఁ జర్చింతు, నారాయణా! 50
మ. పసులంగాపరి యే మెఋంగు మధురప్రాయోల్లసద్వృత్తవా గ్విసరారావము మోవి దా వెదురుగ్రోవిం బెట్టినాఁ డంచు ని\న్ గసటుల్ సేయఁగ నాఁడు గోపిక లతద్గానంబులన్ మన్మథ వ్యసనాసక్తులఁ జేయుచందములు నే వర్ణింతు, నారాయణా! 51
మ. జడ యెంతేఁ దడ వయ్యె జెయ్యి యలసె\న్ శైలంబు మాచేతులం దిడు మన్న\న్ జిరునవ్వుతో వదలిన\న్ హీనోక్తి గీపెట్ట నె క్కుడు గోవుల్ బ్రియమంద నింద్రుఁ డడలం గోవర్ధనాద్రీంద్రమున్ గొడుగై యుండగఁ గేలఁ బూనితి గదా గోవింద, నారాయణా! 52
మ. లలితాకుంచితవేణియం దడవిమొల్లల్ జాఱ ఫాలస్థలి\న్ దిలకం బొయ్యన జాఱఁ గుండలరుచుల్ దీపింప లేఁజెక్కులన్ మొలకన్నవ్వుల చూపు లోరగిల మే న్మువ్వంకల\న్ బోవఁగా నలి గైకొందువు గాదె నీవు మురళీనాట్యంబు, నారాయణా! 53
శా. మాపాలం గడు గ్రొవ్వి గోపికలతో మత్తిల్లి వర్తింతువే మాపాలెంబుల వచ్చి యుండుదు వెస న్మాపాలలో నుండు మీ మాపా లైనసుఖాబ్ధిలో మునుగుచున్ మన్నించి తా గొల్లలన్ మాపాలం గలవేల్పు వీవె యని కా మన్నింతు, నారాయణా! 54
మ. ఒకకాంతామణి కొక్క డీవు మఱియు న్నొక్కర్తె కొక్కండ వై సకలస్త్రీలకు సంతతం బలర రాసక్రీడ తన్మధ్య క ల్పకమూలంబు సవేణునాదరస మొప్పంగా బదార్వేల గో పికలం జెంది వినోద మొందునెడ నీ పెంపొప్పు నారాయణా! 55
మ. లలితం బైన భవత్తనూవిలసనన్ లావణ్యదివ్యామృతం బలుఁగు ల్వారఁగ నీకటాక్షమునఁ దా మందంద గోపాంగనల్ తలఁపు ల్పాదులు కట్టి కందళిత నూత్నశ్రీలు వాటింతు రా నెలతల్ తీవెలు చైత్రవిస్ఫురణమౌ నీ యొప్పు నారాయణా! 56
మ. లీలన్ పూతనప్రాణవాయువులు పాలిండ్లందు వెళ్ళించి, దు శ్శీలుండై చను బండిదానవు వెసం జిందై పడం దన్ని యా రోల న్మద్దులు గూల్చి ధేనుదనుజున్ రోఁజంగ నీల్గించి వే కూలన్ కంసునిఁ గొట్టి గోపికలకోర్కుల్ దీర్తు, నారాయణా! 57
మ. రసనాగ్రంబున నీదు నామరుచియు\న్ రమ్యంబుగాఁ జెవ్లుకు న్నసలారంగ భవత్కథాభిరతియున్ హస్తాబ్జయుగ్మంబులన్ వెస నీపాదసుపూజితాదియుగమున్ విజ్ఞానమధ్యాత్మకున్ వెస నింపొందనివాఁడు దాఁ బశువు సూ వేదాత్మ, నారాయణా! 58
మ. వరకాళిందితరంగడోలికలలో వైకుంఠధామంబులో వెర వొప్పార నయోధ్యలో మధురలో వ్రేపల్లెలో ద్వారకా పురిలో నాడెడుభంగి నాదుమదిలో భూరిప్రసన్నాననాం బురుహం బొప్ప నటించు టొప్పును సితాంభోజాక్ష, నారాయణా! 59
శా. చల్ల ల్వేఱొకయూర నమ్ముకొను నాసం బోవుచోఁ ద్రోవ నీ వుల్లాసంబున నడ్డ కట్టి మదనోద్యోగానులాపంబుల\న్ చల్లన్ జల్లనిచూపు జల్లు మని గోపస్త్రీలపైఁ జల్లు మీ చల్లంబోరుతెఱంగు జిత్తమున నే జర్చింతు నారాయణా! 60
మ. కలయ న్వేదములు\న్ బురాణములు బ్రఖ్యాతంబుగా తెల్పి మీ వలనన్ భక్తి విహీనుఁ డైన పిదపన్ వ్యర్థప్రయత్నంబె పో గులకాంతామణి గొడ్డు వోయిన గతిం గ్రొవ్వారుసస్యంబు దా ఫలకాలంబున నీచపోవు పగిదిన్ పద్మాక్ష, నారాయణా! 61
శా. స్నానంబుల్ నదులందు జేయుట గజస్నానంబు చందంబగు\న్ మౌనం బొప్ప జపించువేద మటవీ మధ్యంబులోనే డ్పగున్ నానాహోమము లెల్ల బూడిదలలోన న్వేల్చు నెయ్యై చను న్నీనామోక్తియు నీపదాబ్జరతియున్ లేకున్న నారాయణా! 62
మ. అల నీటం దగురొంపిపైఁ జిలికిన న్నానీటనే పాయు నా యిల పాపంబులు దుర్భరత్వము మహాహేయంబునం బొందినం బలువై జీవుని దొప్పఁదోఁగినవి యీబాహ్యంబునం బాయునే పొలియుం గాక భవత్సుపాదజలముం బ్రోక్షింప నారాయణా! 63
మ. తనచిత్తాబ్జము మీపదాబ్జములకుం దాత్పర్యసద్భక్తి తం తున బంధించిన బంధనంబు కతనం దుష్పాపపుంజంబు లె ల్లను విచ్ఛిన్నములై యడంగు మహిమోల్లాసాబ్ధి యైనట్టి దా సున కింపొందును మోక్షవైభవము దా సుశ్లోక నారాయణా! 64
మ. తనువుం జీవుఁడు నేక మైనపిదపన్ ధర్మక్రియారంభుఁ డై యనయంబు న్మది దన్నెఋంగక తుది న్నామాయచే మగ్నుఁ డై తనుతత్త్వాదివియోగమైన పిదపం దా నేర్చునే నీదు ద ర్శన మింపారఁగ భక్తివైభవ మహాసంకాశ నారాయణా! 65
మ. తనకు\న్ సాత్వికసంపదాన్విత మహాదాసోహభావంబునన్ ననయంబు న్మది నన్యదైవభజనం బారంగ దూలింపుచున్ జనితాహ్లాదముతోడ నీచరణముల్ సద్భక్తి పూజించి ని\న్ గనుగొన్నంతనె కల్మషంబు లడఁగుం గర్మఘ్న నారాయణా! 66
మ. పరికింపన్ హరిభక్తి భేషజునకున్ భవ్యంబు గా మీఁద మీ చరణాంభోరుహదర్శనంబు గలదే సంప్రీతి నెట్లన్నఁ దా ధరలోఁ జోరుఁడు గన్న దుస్తర పరద్రవ్యంబుపై నాశలం బొరయ న్నేర్చునె దుర్లభం బగు గృపాంభోజాక్ష నారాయణా! 67
మ. పరమజ్ఞాన వివేక పూరిత మహా భవ్యాంతరాళంబున\న్ పరగ న్నీ నిజనామమంత్ర మొనరన్ భక్తి న్ననుష్ఠింపుచుం దురితాన్వేషణ కాలభూతము వెసన్ దూలంగ వాకట్టు వాఁ డరుగున్ భవ్యపదంబు నొందుటకు నై యవ్యక్త నారాయణా! 68
మ. సరిఘోరాంధక బోధకారణ విపత్సంసార మాలిన్యము\న్ పరమానంద సుబోధకారణ లసద్భస్మంబుపై నూఁది యా నిరతజ్ఞానసుకాంతిదర్పణమున న్నిస్సంగుఁ డై తన్ను దా నరయం గాంచినవాఁడు నిన్నుఁగనువాఁ డబ్జాక్ష నారాయణా! 69
మ. పరుషాలాపము లాడ నోడి మది నీపాపార్జనారంభుఁ డై నిరసిం చేరికిఁ గీడు సేయక మది న్నిర్ముక్తకర్ముండు నై పరమానందనిషేధముల్ సమముగా భావించి వీక్షించు నా పరమజ్ఞాని భవత్కృపం బొరయు నో పద్మాక్ష నారాయణా! 70
మ. ఒరులం దన్ను నెఋంగు నియ్యెఋకయు న్నొప్పార నేకాంత మం దరయం బైపడు నన్యభామినులపై నాకాంక్షదూరత్వమున్ మరణావస్థను నీదునామములె సన్మానంబునం దోఁచుటల్ ధరలోన న్నివి దుర్లభంబులు సుధాధామాక్ష నారాయణా! 71
మ. వెర వొప్ప న్బహుశాస్త్రమంత్రము లొగి న్వీక్షించి వే తెల్పి మీ వరనామామృతపూర మానుచుఁ దగన్ వైరాగ్యభావంబున\న్ సరి నశ్రాంతముఁ గోరువారు పిదపన్ సంసారమాతుఃపయో ధరదుగ్ధంబులు గ్రోల నేరరు వెస\న్ దైత్యారి నారాయణా! 72
శా. వేదంబందు సునిశ్చయుండగు మహావేల్పెవ్వఁడో యంచు నా వేదవ్యాస పరాశరుల్ వెదకిన న్వేఱొండు లేఁ డంచు మీ పాదాంభోజము లెల్లప్రొద్దు మదిలో భావింతు రత్యున్నతిన్ శ్రీదేవీవదనారవిందమధుపా శ్రీరంగ నారాయణా! 73
మ. సుతదారాప్తజనాదివిత్తములపై శూన్యాభిలాషుండు నై యతనోద్రేకయుతంబులై పొదలునయ్యై యింద్రియవ్రాతముల్ మృతిఁ బొందించి దమంబునన్ శమమునన్ మీఱంగ వర్తించు ని ర్గతసంసారి భవత్కృపం బొరయు నో కంజాక్ష నారాయణా! 74
మ. ప్రమదం బారఁగ పుణ్యకాలగతులన్ భక్తి న్ననుష్ఠింపుచున్ నమర న్నన్న సువర్ణ గో సలిల కన్యా ధారుణి గ్రామ దా నము లామ్నాయ విధోక్తి భూసురులకున్ సన్మార్గుఁ డై యిచ్చువాఁ డమరేంద్రార్చిత వైభవోన్నతుఁ డగు న్నామీఁద నారాయణా! 75
మ. ఇల నెవ్వారి మనంబులో నెఋక దా నెంతెంత గల్గుండు నా కొలదిం జెంది వెలుంగుచుందు కలయ న్గోవింద నీరూపుల\న్ అలర న్నంబు మితంబు లైసరసిలో నంభోరుహంబుల్ దగ\న్ నిల నొప్పారెడు చంద మొందె దెపుడు న్నీలాంగ నారాయణా! 76
మ. మదిలో నుత్తమభక్తి పీఠముపయి\న్ మానాథ మీపాదముల్ గదియం జేర్చిన వాని కే నొడయడన్ గా దంచు నత్యున్నతిన్ పదిలుం డై సమవర్తి మృత్యువునకు\న్ బాఠంబుగాఁ బల్కు మీ పదపద్మార్చకు లెంత పుణ్యులొ కృపాపారీణ నారాయణా! 77
మ. కుల మెన్నం గొల దేల యేకులజుఁడుం గోత్రాభిమానాభిలా షలునజ్ఞానము బాసి జ్ఞానము మదిన్ సంధించి శుద్ధాత్ముఁడై యలరారం బరుసంబు సోఁకు నిను మున్ హేమాకృతిస్తోమమై వెలయు న్నాగతివాఁడు ముక్తి కరుగున్ వేదాత్మ నారాయణా! 78
మ. నిరతానందయోగులై నియతులై నిర్భాగ్యులై నీచులై కరుణాహీనమనస్కులై మలినులై కష్టాత్ములై నష్టులై పరుషవ్యాధినిబద్ధులై పతితులై భగ్నాంగులై మ్రగ్గువా రరయ న్ని న్నొగి నాత్మయం దిడనివా రబ్జాక్ష నారాయణా! 79
మ. ఘనభోగాస్పదులై గతౌఘమతులై కారుణ్యులై ముక్తులై ధనకీర్తిప్రదులై దయాభిరతులై ధర్మాత్ములై నిత్యులై మనుజాధీశ్వరులై మనోజనిభులై మాన్యస్థులై స్వస్థులై యొనర న్నొప్పెడువారు నీపదరుచి న్నూహించు నారాయణా! 80
మ. విదితామ్నాయ నికాయ భూతములలో విజ్ఞానసంపత్కళా స్పద యోగీంద్రమనస్సరోజములలో బ్రహ్మేంద్రదిక్పాలక త్రిదశవ్రాతకిరీటరత్నములలో దీపించుచున్నట్టి మీ పదపద్మంబులు భావగేహమున నే భావింతు నారాయణా! 81
మ. వెలయన్ యౌవనకాలమందు మరుఁడున్ వృద్ధాప్యకాలంబునన్ బలురోగంబులు నంత్య మందు యముఁడుం బాధింప నట్టైన యీ పలుజన్మంబులు చాల దూలితి ననుం బాలింపవే దేవ మీ ఫలితానంద దయావలోకనము నాపైఁ జూపు నారాయణా! 82
మ. బలుకర్మాయత పాశబంధవితతి\న్ బాహాపరిశ్రేణికి\న్ జలయంత్రాన్విత బంధయాతనగతిన్ సంసారకూపంబులో నలరం ద్రిమ్మరుచుండు నన్ను నకటా! యార్తుండనై వేఁడెదన్ వెలయ న్నీకృపచేతఁ జేకొనవె నన్ వేవేగ నారాయణా! 83
మ. మమహంకార వికారసన్నిభ మహామత్తాది లోభాంధకా రముచే ముక్తికి నేఁగుమార్గ మెఋగ\న్ రా దింక నాలోన నీ విమలాపాంగ దయా దివాకరరుచిన్ వెల్గింపు మింపార నో కమలానంద విహారవక్షలలితా! కంజాక్ష! నారాయణా! 84
మ. పరిపంధిక్రియ నొత్తి వెంటఁ బడునప్పాపంబుఁ దూలించి మీ చరణాబ్జస్థితి పంజరంబు శరణేచ్ఛం జొచ్చితిం గావుమీ బిరుదుం జూడుము మీరు సూడఁగ భవద్భృత్యుండు దుఃఖంబులం బొరయ న్నీ కపకీర్తి గాదె శరదంభోజాక్ష నారాయణా! 85
మ. సతతాచారము సూనృతంబు కృపయున్ సత్యంబునున్ శీలమున్ నతిశాంతత్వము చిత్తశుద్ధికరము న్నధ్యాత్మయు\న్ ధ్యానము\న్ ధృతియున్ ధర్మము సర్వజీవహితముం దూరంబు గాకుండ స మ్మతికిం జేరువ మీనివాససుఖమున్ మానాథ నారాయణా! 86
మ. భవనాశి\న్ గయ తుంగభద్ర యమున\న్ భాగీరథిం గృష్ణ వే త్రవతి న్నర్మద పెన్న గౌతమి పయోరాశి న్వియద్గంగ యం దవగాహంబున నైన పుణ్యములు బెంపారంగ నేఁ డిచ్చట\న్ భవదంఘ్రిస్మరణంబునం గలుగు పో పద్మాక్ష నారాయణా! 87
మ. ధర గ్రామాధిపు నింటిదాసుఁడు వెసం దా ద్రోహముం జేసినన్ పరగం జెల్లుట సూచి తీ భువనసంపాద్యుండ వైనట్టి మీ వరదాసావలి దాసదాసి నని దుర్వారౌఘముల్ జేసితి\న్ కరుణం జేకొని కావు మయ్య త్రిజగత్కల్యాణ నారాయణా! 88
మ. గణుతింప\న్ బహుధర్మశాస్త్రనిగమౌఘం బెప్పుడు న్ని న్నకా రణబంధుం డని చెప్ప నత్తెఱఁగు దూరం బందకుండంగ నే బ్రణతుల్ జేసెదఁ గొంత యైనఁ గణుతింపం బాడి లేకుండినన్ ఋణమా నానుతి నీవు శ్రీపతివి నీ కే లప్పు? నారాయణా! 89
మ. కరినాథుండు జలగ్రహగ్రహణ దుఃఖాక్రాంతుఁడై యీశ మీ శరణం బన్నఁ గృశాను భానుశతతేజస్ఫూర్తి యైనట్టి మీ కరచక్రంబున నక్రకంఠము వెస\న్ ఖండించి మించెం దయా పరసద్భక్త భయానక ప్రకర సత్ప్రాకట్య నారాయణా! 90
శా. ఏభావంబున ని\న్ దలంచె గజయూధేంద్రుండు ఆపన్నుఁడై యేభావంబున ద్రౌప దయ్యెడ రమాధీశా యనె న్వాయసం బేభావంబున నీశరణ్య మనెనో యీ నీ కృపాదృష్టిచే నాభావంబున నీతలంపుఁ గలుగ న్నా కిమ్ము నారాయణా! 91
శా. నీలగ్రీవుఁడు చేతిపున్క విడిచె న్నీయింతి భిక్షంబున\న్ నీలగ్రీవుఁడు యీశ్వరాఖ్యఁ దనరె న్నీనామజప్యంబునన్ నీలగ్రీవుఁడు మించి త్రుంచెఁ బురముల్ నీప్రాపు సేవించినన్ నీలగ్రీవ ముఖాబ్జభాస్కర కృపానిత్యాత్మ నారాయణా! 92
మ. నిను వర్ణింపనివాఁడు మూఁగ మదిలో నీనామమున్ వీనుల\న్ విని మోదింపనివాఁడు చెవ్డు మరి ని\న్ వేడ్క\న్ మనోవీథిని\న్ గని పూజింపనివాఁడు నాశకరుఁడౌ కర్మక్రియారంభుఁడై తనలోఁ గాననివాఁడు నీచమతి పో తత్వజ్ఞ నారాయణా! 93
మ. నిను వర్ణింపని నీచబంధమతి దా నిర్మగ్నమూఢాత్ముఁడై పెనుదైవంబులఁ గోరి తా మనమునన్ సేవించుచందంబు తా నవలం బారిన భూతియందు వెలయ న్నాజ్యాహుతుల్ పూని వే ల్చిన చందంబున వ్యర్థమై తనరు జూ చిద్రూప నారాయణా! 94
మ. నిను వర్ణింపని జిహ్వ దాఁ బదటికా? నీలాభ్రదేహాంగకా నిను నాలింపని చెవ్లు దాఁ బదటికా? నీరేజపత్రేక్షణా నినుఁ బూజింపని కేలు దాఁ బదటికా? నిర్వాహకక్ష్మాతలా నినుఁ జింతింపని యాత్మ దాఁ బదటికా? నిర్వాణ నారాయణా! 95
శా. నీవే తల్లివి నీవె తండ్రి వరయ న్నీవే జగన్నాథుఁడౌ నీవే నిశ్చలబాంధవుండ వరయ న్నీవే మునిస్తుత్యుఁడౌ నీవే శంకరమూలమంత్ర మరయన్ నీవే జగత్కర్తవున్ నీవే దిక్కనువారి వారలె కడు న్నీవారు నారాయణా! 96
మ. అపరాధంబులు నిన్ను నమ్మి విను మే నాజన్మపర్యంతము\న్ విపరీతంబుగఁ జేసినాఁడ నిఁక నీవే దిక్కు నాలోనికి\న్ గపటం బింతయు లేక దండధరుకుం గట్టీక రక్షింపు మీ కృపకుం బాత్రుఁడ నయ్య ధర్మపురి లక్ష్మీనాథ నారాయణా! 97
శా. చెల్లం జేసితి పాతకంబులు మది\న్ శ్రీనాథ మీనామముల్ పొల్లుల్ బోవని నమ్మి పద్యశతమున్ బూర్ణంబుగాఁ జెప్పితిన్ చెల్లంబో నను నమ్మె వీఁడని దయం జేపట్టి రక్షింపుమీ తల్లిం దండ్రియు నీవు గాక యొరులే తర్కింప నారాయణా! 98
మ. నరసిం హాచ్యుత వాసుదేవ వికసన్నాళీకపత్రాక్ష భూ ధర గోవింద ముకుంద కేశవ జగత్త్రా తాహితల్పాంబుజో దర దామోదర తార్క్ష్యవాహన మహాదైత్యారి వైకుంఠమం దిర పీతాంబర భక్తవత్సల కృపన్ దీవింపు నారాయణా! 99
మ. కడకంటం గడలేని సంపద లొగిం గావింపు లక్ష్మీశ పా ల్కడలిన్ బన్నగశాయివై భువనముల్ గల్పించు సత్పుత్రుని\న్ బొడమ\న్ జేసిన నాభిపంకజ జగత్పుణ్యాత్మ భాగీరథీ పడతిం గన్న పదారవిందముల నే భావింతు నారాయణా! 100
మ. తపముల్ మంత్రసమస్తయజ్ఞఫలముల్ దానక్రియారంభముల్ జపముల్ పుణ్యసుతీర్థసేవఫలముల్ సద్వేదవిజ్ఞానము\న్ ఉపవాసవ్రతశీలకర్మఫలముల్ ఒప్పార నిన్నాత్మలో నుపమింపం గలవారికే గలుగు వేయు న్నేల నారాయణా! 101
శా. శ్రీనారాయణ యన్నఁ జాలు దురితశ్రేణి న్నివారింపఁగా నానందస్థితి గల్గు నంచు నిగమార్థానేక మెల్లప్పుడు\న్ నానాభంగులఁ జెప్ప నేను విని శ్రీనారాయణా యంచు ని న్నే నే నెప్పుడు గొల్తు బ్రోవఁ గదె తండ్రీ నన్ను నారాయణా! 102
మ. కలితాఘౌఘ వినాశకారి యగుచుం గైవల్యసంధాయియై నలి నొప్పారెడు మంత్రరాజ మగు నీనామంబు ప్రేమంబున\న్ అలర న్నెవ్వని వాక్కునం బొరయదో యన్నీచు దేహంబు దా వెలయ\న్ భూరుహకోటరం బదియ సూ వేదాత్మ నారాయణా! 103
మ. రమణీయంబుగ నాదిమంబు నవతారంబు\న్ భవద్దివ్యరూ పము నామామృతము\న్ దలంప దశకప్రా ప్తయ్యెఁ గృష్ణావతా రము సుజ్ఞానము మోక్షము\న్ ద్వివిధసంప్రాప్తి\న్ శతాంధ్రాఖ్య కా వ్యము నర్పించితి మీపదాబ్జములకు\న్ వైకుంఠ నారాయణా! 104
శా. నీమూర్తుల్ గన నీకథల్ వినఁ దుది\న్ నీ పాద నిర్మాల్యని ష్ఠామోదంబు నెఋంగ, నీచరణాతోయం బాడ, నైవేద్యముల్ నీమం బొప్ప భజింప నీజపము వర్ణింప\న్ గృపం జేయవే శ్రీ మించ\న్ బహుజన్మ జన్మములకు\న్ శ్రీయాదినారాయణా! 105
Browse Related Categories: