Shatakams · Traditional devotional text · Source: vignanam.org (Traditional devotional text (public-domain shlokas))
శ్రీ రాముని దయచేతను నారూఢిగ సకల జనులు నౌరా యనగా ధారాళమైన నీతులు నోరూరగ జవులు పుట్ట నుడివెద సుమతీ ॥ 1 ॥
అక్కరకు రాని చుట్టము, మ్రొక్కిన వరమీని వేల్పు, మొహరమున దా నెక్కిన బారని గుర్రము గ్రక్కున విడవంగవలయు గదరా సుమతీ ॥ 2 ॥
అడిగిన జీతంబియ్యని మిడిమేలపు దొరను గొల్చి మిడుకుట కంటెన్ వడిగల యెద్దుల గట్టుక మడి దున్నుకు బ్రతుక వచ్చు మహిలో సుమతీ ॥ 3 ॥
అడియాస కొలువు గొలువకు, గుడి మణియము సేయబోకు, కుజనుల తోడన్ విడువక కూరిమి సేయకు, మడవిని దోడరకొంటి నరుగకు సుమతీ ॥ 4 ॥
అధరము గదలియు, గదలక మధురములగు భాష లుడుగి మౌన వ్రతుడౌ అధికార రోగ పూరిత బధిరాంధక శవము జూడ బాపము సుమతీ ॥ 5 ॥
అప్పు కొని చేయు విభవము, ముప్పున బృఆయంపుటాలు, మూర్ఖుని తపమున్, దప్పరయని నృపు రాజ్యము దెప్పరమై మీద గీడు దెచ్చుర సుమతీ ॥ 6 ॥
అప్పిచ్చువాడు, వైద్యుడు నెప్పుడు నెడతెగక పారు నేరును, ద్విజుడున్ జొప్పడిన యూర నుండుము చొప్పడకున్నట్టి యూరు చొరకుము సుమతీ ॥ 7 ॥
అల్లుని మంచితనంబు, గొల్లని సాహిత్య విద్య, కోమలి నిజమున్, బొల్లున దంచిన బియ్యము, దెల్లని కాకులును లేవు తెలియుము సుమతీ ॥ 8 ॥
Offered for worship and study, not as prediction. Non-commercial.
More devotional texts
ఆకొన్న కూడె యమృతము, తాకొంచక నిచ్చువా~ండె దాత ధరిత్రిన్, సోకోర్చువాడె మనుజుడు, తేకువ గలవాడె వంశ తిలకుడు సుమతీ ॥ 9 ॥
ఆకలి యుడుగని కడుపును, వేకటియగు లంజ పడుపు విడువని బ్రతుకున్, బ్రాకొన్న నూతి యుదకము, మేకల పాడియును రోత మేదిని సుమతీ ॥ 10 ॥
ఇచ్చునదే విద్య, రణమున జొచ్చునదే మగతనంబు, సుకవీశ్వరులున్ మెచ్చునదే నేర్చు, వదుకు వచ్చునదే కీడు సుమ్ము వసుధను సుమతీ ॥ 11 ॥
ఇమ్ముగ జదువని నోరును, నమ్మా యని బిలిచి యన్న మడుగని నోరున్, దమ్ముల బిలువని నోరును గుమ్మరి మను ద్రవ్వినట్టి గుంటర సుమతీ ॥ 12 ॥
ఉడుముండదె నూరేండ్లును, బడియుండదె పేర్మి బాము పదినూరేండ్లున్, మడువున గొక్కెర యుండదె, కడు నిల బురుషార్థ పరుడు గావలె సుమతీ ॥ 13 ॥
ఉత్తమగుణములు నీచున కెత్తెఱగున గలుగ నేర్చు; నెయ్యెడలం దా నెత్తిచ్చి కరగి పోసిన నిత్తడి బంగారమగునె యిలలో సుమతీ? ॥ 14 ॥
ఉదకము ద్రావెడు హయమును, మదమున నుప్పొంగుచుండు మత్తేభంబున్, మొదవు కడ నున్న వృషభము, జదువని యానీచు గడకు జనకుర సుమతీ ॥ 15 ॥
ఉపకారికి నుపకారము విపరీతము గాదు సేయ వివరింపంగా; నపకారికి నుపకారము నెపమెన్నక సేయువాడు నేర్పరి సుమతీ ॥ 16 ॥
ఉపమింప మొదలు తియ్యన కపటం బెడనెడను జెఱకు కై వడినే పో నెపములు వెదకును గడపట గపటపు దుర్జాతి పొందు గదరా సుమతీ ॥ 17 ॥
ఎప్పటి కెయ్యది ప్రస్తుత మప్పటికా మాటలాడి, యన్యుల మనముల్ నొప్పించక, తా నొవ్వక, తప్పించుక తిరుగువాడు ధన్యుడు సుమతీ ॥ 18 ॥
ఎప్పుడు దప్పులు వెదకెడు నప్పురుషుని గొల్వగూడ దది యెట్లన్నన్ సర్పంబు పడగ నీడను గప్ప వసించిన విధంబు గదరా సుమతీ ॥ 19 ॥
ఎప్పుడు సంపద కలిగిన నప్పుడు బంధువులు వత్తు రది యెట్లన్నన్ తెప్పలుగ జెఱువు నిండిన గప్పలు పదివేలు చేరు గదరా సుమతీ ॥ 20 ॥
ఏఱకుమీ కసుగాయలు, దూఱకుమీ బంధుజనుల దోషము సుమ్మీ, పాఱకుమీ రణమందున, మీఱకుమీ గురువు నాజ్ఞ మేదిని సుమతీ ॥ 21 ॥
ఒక యూరికి నొక కరణము, నొక తీర్పరియైన గాక, నొగి దఱుచైనన్, గకవికలు గాక యుండునె సకలంబును గొట్టువడక సహజము సుమతీ ॥ 22 ॥
ఒరు నాత్మ దలచు సతి విడు, మఱుమాటలు పలుకు సతుల మన్నింపకుమీ, వెఱ పెఱుగని భటునేలకు, తఱచుగ సతి గవయ బోకు, తగదుర సుమతీ ॥ 23 ॥
ఒల్లని సతి నొల్లని పతి, నొల్లని చెలికాని విడువ నొల్లని వాడే గొల్లండు, కాక ధరలో గొల్లండును గొల్లడౌనె గుణమున సుమతీ ॥ 24 ॥
ఓడల బండ్లును వచ్చును, ఓడలు నాబండ్లమీద నొప్పుగ వచ్చున్, ఓడలు బండ్లును వలనే వాడంబడు గలిమి లేమి వసుధను సుమతీ ॥ 25 ॥
కడు బలవంతుడైనను బుడమిని బ్రాయంపుటాలి బుట్టిన యింటన్ దడవుండ నిచ్చెనేనియు బడుపుగ నంగడికి దానె బంపుట సుమతీ ॥ 26 ॥
కనకపు సింహాసనమున శునకము గూర్చుండబెట్టి శుభ లగ్నమునం దొనరగ బట్టము గట్టిన వెనుకటి గుణమేల మాను వినరా సుమతీ ॥ 27 ॥
కప్పకు నొరగాలైనను, సర్పమునకు రోగమైన, సతి తులువైనన్, ముప్పున దరిద్రుడైనను, తప్పదు మఱి దుఃఖ మగుట తథ్యము సుమతీ ॥ 28 ॥
కమలములు నీట బాసిన కమలాప్తుని రశ్మి సోకి కమలిన భంగిన్ తమ తమ నెలవులు దప్పిన తమ మిత్రులు శత్రులౌట తథ్యము సుమతీ ॥ 29 ॥
కరణము గరణము నమ్మిన మరణాంతక మౌను గాని మనలేడు సుమీ, కరణము దన సరి కరణము మఱి నమ్మక మర్మ మీక మనవలె సుమతీ ॥ 30 ॥
కరణముల ననుసరింపక విరసంబున దిన్న తిండి వికటించు జుమీ యిరుసున కందెన బెట్టక పరమేశ్వరు బండి యైన బారదు సుమతీ ॥ 31 ॥
కరణము సాదైయున్నను, గరి మద ముడిగినను, బాము గఱవక యున్నన్, ధర దేలు మీటకున్నను, గర మరుదుగ లెక్క గొనరు గదరా సుమతీ ॥ 32 ॥
కసుగాయ గఱచి చూచిన మసలక పస యొగరు రాక మధురంబగునా, పస గలుగు యువతులుండగ పసి బాలల బొందువాడు పశువుర సుమతీ ॥ 33 ॥
కవి కాని వాని వ్రాతయు, నవరస భావములు లేని నాతుల వలపున్, దవిలి చను పంది నేయని వివిధాయుధ కౌశలంబు వృధరా సుమతీ ॥ 34 ॥
కాదు సుమీ దుస్సంగతి, పోదుసుమీ "కీర్తి" కాంత పొందిన పిదపన్, వాదు సుమీ యప్పిచ్చుట, లేదు సుమీ సతుల వలపు లేశము సుమతీ ॥ 35 ॥
కాముకుడు దనిసి విడిచిన కోమలి బరవిటుడు గవయ గోరుట యెల్లన్ బ్రేమమున జెఱకు పిప్పికి చీమలు వెస మూగినట్లు సిద్ధము సుమతీ ॥ 36 ॥
కారణము లేని నగవును, బేరణము లేని లేమ, పృథివీ స్థలిలో బూరణము లేని బూరెయు, వీరణము లేని పెండ్లి వృధరా సుమతీ ॥ 37 ॥
కులకాంత తోడ నెప్పుడు గలహింపకు, వట్టి తప్పు ఘటియింపకుమీ, కలకంఠి కంట కన్నీ రొలికిన సిరి యింట నుండ నొల్లదు సుమతీ ॥ 38 ॥
కూరిమి గల దినములలో నేరము లెన్నడును గలుగ నేరవు మఱి యా కూరిమి విరసంబైనను నేరములే తోచు చుండు నిక్కము సుమతీ ॥ 39 ॥
కొంచెపు నరు సంగతిచే నంచితముగ గీడు వచ్చు నది యెట్లన్నన్ గించిత్తు నల్లి కుట్టిన మంచమునకు జేటు వచ్చు మహిలో సుమతీ ॥ 40 ॥
కొక్కోకమెల్ల జదివిన, చక్కనివాడైన, రాజ చంద్రుండైనన్, మిక్కిలి రొక్కము లియ్యక, చిక్కదురా వారకాంత సిద్ధము సుమతీ ॥ 41 ॥
కొఱ గాని కొడుకు బుట్టిన కొఱ గామియె కాదు, తండ్రి గుణముల జెఱచున్ చెఱకు తుద వెన్ను బుట్టిన జెఱకున తీపెల్ల జెఱచు సిద్ధము సుమతీ ॥ 42 ॥
కోమలి విశ్వాసంబును, బాములతో జెలిమి, యన్య భామల వలపున్, వేముల తియ్యదనంబును, భూమీశుల నమ్మికలును బొంకుర సుమతీ ॥ 43 ॥
గడన గల మగని జూచిన నడుగడుగున మడుగు లిడుదు రతివలు దమలో, గడ నుడుగు మగని జూచిన నడ పీనుగు వచ్చె నంచు నగుదురు సుమతీ ॥ 44 ॥
చింతింపకు కడచిన పని, కింతులు వలతురని నమ్మ కెంతయు మదిలో, నంతఃపుర కాంతలతో మంతనముల మాను మిదియె మతముర సుమతీ ॥ 45 ॥
చీమలు పెట్టిన పుట్టలు పాముల కిరవైనయట్లు పామరుడు దగన్ హేమంబు గూడ బెట్టిన భూమీశుల పాల జేరు భువిలో సుమతీ ॥ 46 ॥
చుట్టములు గాని వారలు చుట్టములము నీకటంచు సొంపు దలిర్పన్ నెట్టుకొని యాశ్రయింతురు గట్టిగ ద్రవ్యంబు గలుగ గదరా సుమతీ ॥ 47 ॥
చేతులకు దొడవు దానము, భూతలనాథులకు దొడవు బొంకమి ధరలో, నీతియె తొడవెవ్వారికి, నాతికి మానంబు తొడవు నయముగ సుమతీ ॥ 48 ॥
తడ వోర్వక, యొడ లోర్వక, కడు వేగం బడిచి పడిన గార్యం బగునే, తడ వోర్చిన, నొడ లోర్చిన, జెడిపోయిన కార్యమెల్ల జేకుఱు సుమతీ ॥ 49 ॥
తన కోపమె తన శత్రువు, తన శాంతమె తనకు రక్ష, దయ చుట్టంబౌ తన సంతోషమె స్వర్గము, తన దుఃఖమె నరక మండ్రు తథ్యము సుమతీ ॥ 50 ॥
తన యూరి తపసి తపమును, తన పుత్రుని విద్య పెంపు, దన సతి రూపున్, దన పెరటి చెట్టు మందును, మనసున వర్ణింపరెట్టి మనుజులు సుమతీ ॥ 51 ॥
తన కలిమి యింద్ర భోగము, తన లేమియె స్వర్గలోక దారిద్ర్యంబున్, దన చావు జల ప్రళయము, తను వలచిన యదియె రంభ తథ్యము సుమతీ ॥ 52 ॥
తన వారు లేని చోటను, జనమించుక లేని చోట, జగడము చోటన్, అనుమానమైన చోటను, మనుజునకును నిలువ దగదు మహిలో సుమతీ ॥ 53 ॥
తమలము వేయని నోరును, విమతులతో చెలిమి చేసి వెతబడు తెలివిన్, గమలములు లేని కొలకును, హిమధాముడు లేని రాత్రి హీనము సుమతీ ॥ 54 ॥
తలనుండు విషము ఫణికిని, వెలయంగా దోక నుండు వృశ్చికమునకున్, తల తోక యనక యుండును ఖలునకు నిలువెల్ల విషము గదరా సుమతీ ॥ 55 ॥
తలపొడుగు ధనము పోసిన వెలయాలికి నిజము లేదు వివరింపంగా దల దడివి బాస జేసిన వెలయాలిని నమ్మరాదు వినరా సుమతీ ॥ 56 ॥
తల మాసిన, నొలు మాసిన, వలువలు మాసినను బ్రాణ వల్లభునైనన్ గులకాంతలైన రోతురు తిలకింపగ భూమిలోన దిరముగ సుమతీ ॥ 57 ॥
తాను భుజింపని యర్థము మానవ పతి జేరు గొంత మఱి భూగతమౌ గానల నీగలు గూర్చిన తేనియ యొరు జేరునట్లు తిరముగ సుమతీ ॥ 58 ॥
దగ్గఱ కొండెము సెప్పెడు ప్రెగ్గడ పలుకులకు రాజు ప్రియుడై మఱి దా నెగ్గు బ్రజ కాచరించుట బొగ్గులకై కల్పతరువు బొడుచుట సుమతీ ॥ 59 ॥
ధనపతి సఖుడై యుండిన నెనయంగా శివుడు భిక్షమెత్తగ వలసెన్, దన వారి కెంత గలిగిన దన భాగ్యమె తనకు గాక తథ్యము సుమతీ ॥ 60 ॥
ధీరులకు జేయు మేలది సారంబగు నారికేళ సలిలము భంగిన్ గౌరవమును మఱి మీదట భూరి సుఖావహము నగును భువిలో సుమతీ ॥ 61 ॥
నడువకుమీ తెరువొక్కట, గుడువకుమీ శత్రు నింట గూరిమి తోడన్, ముడువకుమీ పరధనముల, నుడువకుమీ యొరుల మనసు నొవ్వగ సుమతీ ॥ 62 ॥
నమ్మకు సుంకరి, జూదరి, నమ్మకు మొగసాల వాని, నటు వెలయాలిన్, నమ్మకు మంగడి వానిని, నమ్మకు మీ వామ హస్తు నవనిని సుమతీ ॥ 63 ॥
నయమున బాలుం ద్రావరు, భయమునను విషమ్మునైన భక్షింతురుగా, నయమెంత దోషకారియొ, భయమే జూపంగ వలయు బాగుగ సుమతీ ॥ 64 ॥
నరపతులు మేఱ దప్పిన, దిరమొప్పగ విధవ యింట దీర్పరి యైనన్, గరణము వైదికుడైనను, మరణాంతక మౌనుగాని మానదు సుమతీ ॥ 65 ॥
నవరస భావాలంకృత కవితా గోష్టియును, మధుర గానంబును దా నవివేకి కెంత జెప్పిన జెవిటికి శంఖూదినట్లు సిద్ధము సుమతీ ॥ 66 ॥
నవ్వకుమీ సభ లోపల, నవ్వకుమీ తల్లి, దండ్రి, నాథుల తోడన్, నవ్వకుమీ పరసతితో, నవ్వకుమీ విప్రవరుల నయమిది సుమతీ ॥ 67 ॥
నీరే ప్రాణాధారము నోరే రసభరితమైన నుడువుల కెల్లన్ నారియె నరులకు రత్నము చీరయె శృంగారమండ్రు సిద్ధము సుమతీ ॥ 68 ॥
పగవల దెవ్వరి తోడను, వగవంగా వలదు లేమి వచ్చిన పిదపన్, దెగ నాడ వలదు సభలను మగువకు మనసియ్య వలదు మహిలో సుమతీ ॥ 69 ॥
పతికడకు, దన్ను గూరిన సతికడకును, వేల్పు కడకు, సద్గురు కడకున్, సుతుకడకు రిత్తచేతుల మతిమంతులు చనరు నీతి మార్గము సుమతీ ॥ 70 ॥
పనిచేయునెడల దాసియు, ననుభవమున రంభ, మంత్రి యాలోచనలన్, దనభుక్తి యెడల దల్లియు, నన్ దన కులకాంత యుండు నగురా సుమతీ ॥ 71 ॥
పరనారీ సోదరుడై, పరధనముల కాసపడక, పరులకు హితుడై, పరులు దను బొగడ నెగడక, పరు లలిగిన నలుగ నతడు పరముడు సుమతీ ॥ 72 ॥
పరసతి కూటమి గోరకు, పరధనముల కాసపడకు, బరునెంచకుమీ, సరిగాని గోష్టి సేయకు, సిరిచెడి చుట్టంబు కడకు జేరకు సుమతీ ॥ 73 ॥
పరసతుల గోష్ఠి నుండిన పురుషుడు గాంగేయుడైన భువి నింద పడున్, బరసతి సుశీలయైనను బరుసంగతి నున్న నింద పాలగు సుమతీ ॥ 74 ॥
పరులకు నిష్టము సెప్పకు, పొరుగిండ్లకు బనులు లేక పోవకు మెపుడున్, బరు గదిసిన సతి గవయకు, మెఱిగియు బిరుసైన హయము లెక్కకు సుమతీ ॥ 75 ॥
పర్వముల సతుల గవయకు, ముర్వీశ్వరు కరుణ నమ్మి యుబ్బకు మదిలో, గర్వింప నాలి బెంపకు, నిర్వహణము లేని చోట నిలువకు సుమతీ ॥ 76 ॥
పలు దోమి సేయు విడియము, తలగడిగిన నాటి నిద్ర, తరుణులయెడలన్ బొల యలుక నాటి కూటమి వెల యింతని చెప్పరాదు వినరా సుమతీ ॥ 77 ॥
పాటెఱుగని పతి కొలువును, గూటంబున కెఱుకపడని కోమలి రతియున్, బేటెత్త జేయు చెలిమియు, నేటికి నెదురీదినట్టు లెన్నగ సుమతీ ॥ 78 ॥
పాలను గలసిన జలమును పాల విధంబుననె యుండు బరికింపంగా పాల చవి జెఱచు గావున పాలసుడగు వాని పొందు వలదుర సుమతీ ॥ 79 ॥
పాలసునకైన యాపద జాలింబడి తీర్ప దగదు సర్వజ్ఞునకున్ తేలగ్ని బడగ బట్టిన మేలెఱుగునె మీటు గాక మేదిని సుమతీ ॥ 80 ॥
పిలువని పనులకు బోవుట, గలయని సతి గతియు, రాజు గానని కొలువుం, బిలువని పేరంటంబును, వలువని చెలిమియును జేయ వలదుర సుమతీ ॥ 81 ॥
పుత్రోత్సాహము తండ్రికి పుత్రుడు జన్మించినపుడె పుట్టదు, జనులా పుత్రుని కనుగొని బొగడగ పుత్రోత్సాహంబు నాడు పొందుర సుమతీ ॥ 82 ॥
పురికిని ప్రాణము గోమటి, వరికిని ప్రాణంబు నీరు వసుమతి లోనన్, గరికిని ప్రాణము తొండము, సిరికిని ప్రాణంబు మగువ సిద్ధము సుమతీ ॥ 83 ॥
పులి పాలు దెచ్చి యిచ్చిన, నలవడగా గుండె గోసి యఱచే నిడినన్, దలపొడుగు ధనము బోసిన, వెలయాలికి గూర్మి లేదు వినరా సుమతీ ॥ 84 ॥
పెట్టిన దినముల లోపల నట్టడవులనైన వచ్చు నానార్థములున్, బెట్టని దినముల గనకపు గట్టెక్కిన నేమి లేదు గదరా సుమతీ ॥ 85 ॥
పొరుగున బగవాడుండిన, నిరవొందక వ్రాతకాడె యేలిక యైనన్, ధర గాపు కొండెమాడిన, గరణాలకు బ్రదుకు లేదు గదరా సుమతీ ॥ 86 ॥
బంగారు కుదువ బెట్టకు, సంగరమున బాఱిపోకు సరసుడవైతే, నంగడి వెచ్చము వాడకు, వెంగలితో జెలిమి వలదు వినరా సుమతీ ॥ 87 ॥
బలవంతుడ నాకేమని పలువురతో నిగ్రహించి పలుకుట మేలా, బలవంత మైన సర్పము చలి చీమల చేత జిక్కి చావదె సుమతీ ॥ 88 ॥
మదినొకని వలచి యుండగ మదిచెడి యొక క్రూర విటుడు మానక తిరుగున్ బది చిలుక పిల్లి పట్టిన జదువునె యాపంజరమున జగతిని సుమతీ ॥ 89 ॥
మండల పతి సముఖంబున మెండైన ప్రధాని లేక మెలగుట యెల్లన్ గొండంత మదపు టేనుగు తొండము లేకుండినట్లు దోచుర సుమతీ ॥ 90 ॥
మంత్రిగలవాని రాజ్యము తంత్రము సెడకుండ నిలుచు దఱచుగ ధరలో మంత్రి విహీనుని రాజ్యము జంత్రపు గీలూడినట్లు జరుగదు సుమతీ ॥ 91 ॥
మాటకు బ్రాణము సత్యము, కోటకు బ్రాణంబు సుభట కోటి, ధరిత్రిన్ బోటికి బ్రాణము మానము, చీటికి బ్రాణంబు వ్రాలు సిద్ధము సుమతీ ॥ 92 ॥
మానధను డాత్మధృతి చెడి హీనుండగు వాని నాశ్రయించుట యెల్లన్ మానెడు జలముల లోపల నేనుగు మెయి దాచినట్టు లెఱుగుము సుమతీ ॥ 93 ॥
మేలెంచని మాలిన్యుని, మాలను, మొగసాలెవాని, మంగలి హితుగా నేలిన నరపతి రాజ్యము నేల గలసి పోవుగాని నెగడదు సుమతీ ॥ 94 ॥
రాపొమ్మని పిలువని యా భూపాలుని గొల్వ భుక్తి ముక్తులు గలవే దీపంబు లేని యింటను జేపున కీళ్ళాడినట్లు సిద్ధము సుమతీ ॥ 95 ॥
రూపించి పలికి బొంకకు, ప్రాపగు చుట్టంబు నెగ్గు పలుకకు మదిలో, గోపించు రాజు గొల్వకు, పాపపు దేశంబు సొఱకు పదిలము సుమతీ ॥ 96 ॥
లావిగలవాని కంటెను భావింపగ నీతిపరుడు బలవంతుండౌ గ్రానంబంత గజంబును మావటివాడెక్కినట్లు మహిలో సుమతీ ॥ 97 ॥
వఱదైన చేను దున్నకు, కఱవైనను బంధుజనుల కడ కేగకుమీ, పరులకు మర్మము చెప్పకు, పిరికికి దళవాయి తనము పెట్టకు సుమతీ ॥ 98 ॥
వరిపంట లేని యూరును, దొర యుండని యూరు, తోడు దొరకని తెరువున్, ధరను పతి లేని గృహమును నరయంగా రుద్రభూమి యనదగు సుమతీ ॥ 99 ॥
వినదగు నెవ్వరు జెప్పిన వినినంతనె వేగ పడక వివరింప దగున్ కని కల్ల నిజము దెలిసిన మనుజుడె పో నీతి పరుడు మహిలో సుమతీ ॥ 100 ॥
వీడెము సేయని నోరును, జేడెల యధరామృతంబు సేయని నోరున్, పాడంగరాని నోరును బూడిద కిరవైన పాడు బొందర సుమతీ ॥ 101 ॥
వెలయాలి వలన గూరిమి గలగదు, మఱి గలిగెనేని కడతేఱదుగా, బలువురు నడచెడు తెరువున మొలవదు పువు, మొలిచెనేని పొదలదు సుమతీ ॥ 102 ॥
వెలయాలు చేయు బాసలు, వెలయగ మొగసాల బొందు వెలమల చెలిమిన్, గలలోన గన్న కలిమియు విలసితముగ నమ్మరాదు వినరా సుమతీ ॥ 103 ॥
వేసరపు జాతి గానీ, వీసము దా జేయనట్టి వీరిడి గానీ, దాసి కొడుకైన గానీ, కాసులు గల వాడె రాజు గదరా సుమతీ ॥ 104 ॥
శుభముల పొందని చదువును, నభినయముగ రాగరసము నందని పాటల్, గుభ గుభలు లేని కూటమి, సభ మెచ్చని మాటలెల్ల జప్పన సుమతీ ॥ 105 ॥
సరసము విరసము కొఱకే, పరిపూర్ణ సుఖంబు లధిక బాధల కొఱకే, పెరుగుట విరుగుట కొఱకే, ధర తగ్గుట హెచ్చు కొఱకె తథ్యము సుమతీ ॥ 106 ॥
సిరి తా వచ్చిన వచ్చును సలలితముగ నారికేళ సలిలము భంగిన్, సిరి తా బోయిన బోవును కరి మ్రింగిన వెలగ పండు కరణిని సుమతీ ॥ 107 ॥
స్త్రీల యెడ వాదులాడకు, బాలురతో జెలిమిచేసి భాషింపకుమీ, మేలైన గుణము విడువకు, మేలిన పతి నింద సేయ కెన్నడు సుమతీ ॥ 108 ॥
Browse Related Categories: