Shatakams · Traditional devotional text · Source: vignanam.org (Traditional devotional text (public-domain shlokas))
తలపులోన గలుగు దా దైవమే ప్రొద్దు తలచి చూడనతకు తత్వమగును వూఱకుండ నేర్వునుత్తమ యోగిరా విశ్వదాభిరామ వినుర వేమ! ॥ 1 ॥
తన విరక్తి యనెడి దాసి చేతను జిక్కి మిగిలి వెడలవేక మిణుకుచున్న నరుడి కేడముక్తి వరలెడి చెప్పడీ విశ్వదాభిరామ వినుర వేమ! ॥ 2 ॥
తనదు మనసుచేత దర్కించి జ్యోతిష మెంత చేసే ననుచు నెంచి చూచు, తన యదృష్టమంత దైవ మెఱుంగడా? విశ్వదాభిరామ వినుర వేమ! ॥ 3 ॥
టీక వ్రాసినట్లేనేకులు పెద్దలు లోకమందు జెప్పి మంచు కాకులట్టి జనుల కానరీ మర్మము విశ్వదాభిరామ వినుర వేమ! ॥ 4 ॥
జ్ఞానమెన్న గురువు జ్ఞానహైన్యము బుద్ధి రెంటినందు రిమ్మరేచునపుడు రిమ్మ తెలిపెనేని రెండొక రూపురా విశ్వదాభిరామ వినుర వేమ! ॥ 5 ॥
జాణలమని యంద్రు చపలాత్ములగువారు తెలివిలేక తమ్ముతెలియలేరు కష్టమైన యడవి గాసీలుచున్నారు విశ్వదాభిరామ వినుర వేమ! ॥ 6 ॥
జనన మరణములన స్వప్న సుషుప్తులు జగములందు నెండ జగములుండు నరుడు జగమునంట నడుబాటు కాదొకో విశ్వదాభిరామ వినుర వేమ! ॥ 7 ॥
ఛాయననొసగుచెట్లు సాధువు బోధట్టు లడగి దరినిజేరి పడయవచ్చు నట్టునిట్టు దాటనది పోవునిది రామ విశ్వదాభిరామ వినుర వేమ! ॥ 8 ॥
Offered for worship and study, not as prediction. Non-commercial.
More devotional texts
నరుడెయైన లేక నారాయణుండైన తత్త్వబద్ధుడైన దరణి నరయ మరణమున్నదనుచు మదిని నమ్మగవలె విశ్వదాభిరామ వినుర వేమ! ॥ 9 ॥
ద్వారంబంధమునకు దలుపులు గడియలు వలెనె నోటికొప్పుగల నియతులు ధర్మమెరిగి పలుక ధన్యుండౌ భువిలోన విశ్వదాభిరామ వినుర వేమ! ॥ 10 ॥
బ్రహ్మఘటము మేను ప్రాణంబు తగగాలి మిత్రచంద్ర శిఖులు నేత్రచయము మఱియు బ్రహ్మమనగ మహిమీద లేదయా విశ్వదాభిరామ వినుర వేమ! ॥ 11 ॥
యోగిననుచు గొంత యోగముగూర్చక జగమునెల్లబట్ట చంపి తినుచు ధనము కొఱకు వాడు తగవాడుచుండిన యోగికాడు వాడె యోగు వేమ! ॥ 12 ॥
అర్ధ యంకణమున కాధారమైనట్టి యొంటిమేడ గుంజు నొనరనిల్పె నింటికొక మగండె యిల్లాండ్రునేద్గురు విశ్వదాభిరామ వినుర వేమ! ॥ 13 ॥
అన్నదానమునకు నధిక సంపదగల్గి యమరలోక పూజ్యుడగును మీఱు అన్నమగును బ్రహ్మమది కనలేరయా విశ్వదాభిరామ వినుర వేమ! ॥ 14 ॥
బొంది యెవరి సొమ్ము పోషింపబలుమారు ప్రాణ మెవరి సొమ్ము భక్తిసేయ, ధనమదెవరిసొమ్ము ధర్మమె తన సొమ్ము విశ్వదాభిరామ వినుర వేమ! ॥ 15 ॥
పండువలన బుట్టె బరగ ప్రపంచము పండువలన బుట్టె పరము నిహము పండు మేలెఱింగె బ్రహ్లాదుడిలలోన విశ్వదాభిరామ వినుర వేమ! ॥ 16 ॥
తపమువేల? యరయ ధాత్రిజనులకెల్ల నొనర శివుని జూడ నుపమ గలదు మనసు చదరనీక మహిలోన జూడరా విశ్వదాభిరామ వినుర వేమ! ॥ 17 ॥
తనగుణము తనకు నుండగ నెనయంగా నోరుని గుణము నెంచును మదిలో దన గుణము తెలియ కన్యుని బనిగొని దూషించువాడు వ్యర్థుడు వేమ! ॥ 18 ॥
జాలినొందరాదు జవదాటి కనరాదు అది మూలమైన ఆత్మమఱుగు పోరిచేరి పొంది పూర్ణము నందురా విశ్వదాభిరామ వినుర వేమ! ॥ 19 ॥
జాతి, మతము విడిచి చని యోగికామేలు జాతితో నెయున్న నీతివలదె మతముబట్టి జాతి మానకుంట కొఱంత విశ్వదాభిరామ వినుర వేమ! ॥ 20 ॥
నీవనినను నేననినను భావమ్మున నెఱుకయొక్క పద్ధతియగునా భావంబు దెలిసి మదిని ర్భావముగా నిన్ను గనుట పరమగు వేమ! ॥ 21 ॥
నీళ్ల మునుగనేల? నిధుల మెట్టగనేల మొనసి వేల్పులకును మ్రొక్కనేల కపట కల్మషములు కడుపులో నుండగా విశ్వదాభిరామ వినుర వేమ! ॥ 22 ॥
పంచ ముఖములందు బంచాక్షరి జనించె పంచ వర్ణములను ప్రబలె జగము పంచముఖుని మీరు ప్రస్తుతి చేయుండీ విశ్వదాభిరామ వినుర వేమ! ॥ 23 ॥
నేయి వెన్న కాచి నీడనే యుంచిన బేరి గట్టిపడును పెరుగురీతి పోరిపోరి మదిని పోనీక పట్టుము విశ్వదాభిరామ వినుర వేమ! ॥ 24 ॥
మంటికుండవంటి మాయ శరీరంబు చచ్చునెన్నడైన, చావదాత్మ ఘటములెన్నియైన గగనమొక్కటేగదా, విశ్వదాభిరామ వినుర వేమ! ॥ 25 ॥
మంట లోహమందు మ్రాకుల శిలలందు పటములందు గోడప్రతిమలందు తన్నుదెలియు కొఱకుదగులదా పరమాత్మ విశ్వదాభిరామ వినుర వేమ! ॥ 26 ॥
నిమిషమైనను మది నిల్చి నిర్మలముగ లింగ జీవావేశులను గాంచి భంగపడక పూజ మదియందు జేరుట పూర్ణపదవి పరము గోరిన నిదిచేయ బాగు వేమ! ॥ 27 ॥
ధూమాదుల నావృతమై వ్యోమంబునకెగని కలియు నుపములు తనలో శ్రీమించు శివుని జేరును గామాదుల గలియడతడు ఘనముగ వేమ! ॥ 28 ॥
పగలుడుగ నాసలుడుగును వగపుడుగం గోర్కెలుడుగు వడి జన్మంబుల్ తగులుడుగు భోగముడిగిన త్రిగుణంబును నడుగ ముక్తి తెరువగు వేమ! ॥ 29 ॥
పాల నీటి కలత పరమహంస మెఱుగును నీరు పాలు నెట్లు నేర్చునెమలి లజ్ఞుడైన హీనుడల శివు నెఱుగునా? విశ్వదాభిరామ వినుర వేమ! ॥ 30 ॥
పుట్టు పుట్టలేదే పుడమిని జనులెల్ల పుట్టి గిట్టలేదె పూర్వులెవరు పుట్టి గిట్టుటెల్ల వట్టి భ్రాంతులు సుమీ, విశ్వదాభిరామ వినుర వేమ! ॥ 31 ॥
పరుల విత్తమందు భ్రాంతి వాసినయట్టి పురుషుడవనిలోన పుణ్యమూర్తి పరుల విత్తమరయ పాపసంచితమగు విశ్వదాభిరామ వినుర వేమ! ॥ 32 ॥
పరధనంబులకును ప్రాణములిచ్చును సత్యమంతలేక జారడగును ద్విజులమంచు నింత్రుతేజమించుకలేదు విశ్వదాభిరామ వినుర వేమ! ॥ 33 ॥
నోరు పలకవచ్చు నుడి వ్రాయగరాదు వ్రాతకన్న సాక్షి వలవదన్న పరగలేని వ్రాత భంగ పాటుందెచ్చు విశ్వదాభిరామ వినుర వేమ! ॥ 34 ॥
నిజమాకల్ల రెండు నీలకంఠుడెఱుంగు నిజములాడకున్న నీతిదప్పు నిజములాడునపుడు నీ రూపమనవచ్చు విశ్వదాభిరామ వినుర వేమ! ॥ 35 ॥
దశగలారినెల్ల దమ బంధువు లటండ్రు దశయలేమి నెంత్రు తక్కువగను దశయన గమ ధన దశమొక్కటే దశ విశ్వదాభిరామ వినుర వేమ! ॥ 36 ॥
తామసించి చేయదగ దెట్టి కార్యంబు వేగిరింప నదియు విషమగును పచ్చికాయదెచ్చి పడవేయ ఫలమౌనే విశ్వదాభిరామ వినుర వేమ! ॥ 37 ॥
తల్లిబిడ్డలకును తగవు పుట్టించెడి ధనము సుఖము గూర్చునని గడింత్రు కాని యెల్లయెడల ఘన దుఃఖన్దమది విశ్వదాభిరామ వినుర వేమ! ॥ 38 ॥
తల్లిదండ్రులెన్నదగు తొలి గురువులు పార్వతీభవు లిలబరమగురులు కూలివాండ్ర జగతి గురులన ద్రోహము విశ్వదాభిరామ వినుర వేమ! ॥ 39 ॥
తామసించి చేయదగ దెట్టి కార్యంబు వేగిరింప నదియు విషమగును పచ్చికాయదెచ్చి పడవేయ ఫలమౌనే విశ్వదాభిరామ వినుర వేమ! ॥ 40 ॥
పుట్టు పుట్టలేదే పుడమిని జనులెల్ల పుట్టి గిట్టలేదె పూర్వులెవరు పుట్టి గిట్టుటెల్ల వట్టి భ్రాంతులు సుమీ, విశ్వదాభిరామ వినుర వేమ! ॥ 41 ॥
పెట్టిపోయలేని వట్టి దేబెలు భూమి బుట్టిరేమి వారు గిట్టరేమి పుట్టలోని చెదలు పుట్టదా గిట్టదా! విశ్వదాభిరామ వినుర వేమ! ॥ 42 ॥
లోకమందుబుట్టి లోకమందె పెరిగి లోక విభవమోర్వలేక జనుడు లోకమందు జనికి లోబడి చెడిపోవును విశ్వదాభిరామ వినుర వేమ! ॥ 43 ॥
మది గలిగిన పూజ మదనారి మెచ్చును మనసు నిల్సినంత మహితుడగును మనసులేని పూజ మట్టి సమానము విశ్వదాభిరామ వినుర వేమ! ॥ 44 ॥
తామును జనులేమను కొన బూనుదురో దాని సరసి పొందిన జడనీ, రాని పధంబున నడిచిన దాననె ధర్మాత్ముడండ్రు తన్నిట వేమ! ॥ 45 ॥
మదము వలన గలుగు మాటలు మఱిపల్కి మ్రుచ్చు సద్దులనొగి మోసపుచ్చి కాసురాబెనగెడు కష్ఠుండు గురుడౌనే? విశ్వదాభిరామ వినుర వేమ! ॥ 46 ॥
మనసే మాయా మృగమౌ మననేమిటి పైకిగానీ మణిపోనీకా మనసున మనసును జంపిన మనందే ముక్తిగలదు మహిలో వేమ! ॥ 47 ॥
మంత్రమొకటి చెప్పి మఱి దేవతార్చన చేసి తమకుగరుణచెందినదని వేదపఠన చేసి వెర్రులై పోదురు, విశ్వదాభిరామ వినుర వేమ! ॥ 48 ॥
మఠములోనియోగి మాయలన్నియుగోసి ఘటములోన నున్న ఘనునిదెలిసి మాట మాటకుగురు మరువక తెలుపురా, విశ్వదాభిరామ వినుర వేమ! ॥ 49 ॥
తిరిగి వచ్చువేళ మరలిపోయెడి వేళ వెంట దేరు ధనము వంటబోరు తొనెటకు జనునొ ధనమెందు బోవునో విశ్వదాభిరామ వినుర వేమ! ॥ 50 ॥
ఆశయనెడు దాని గోసివేయగాలేక మొహబుద్ది వలన మునుగువారు కాశివాసులైన గనబోరు మోక్షము విశ్వదాభిరామ వినుర వేమ! ॥ 51 ॥
చిత్తమనేడి వేరే శిథిలమైనప్పుడే ప్రకృతి యనెడి చెట్టు పడును పిదప గోర్కులనెడి పెద్దకొమ్మలెండును గదా విశ్వదాభిరామ వినుర వేమ! ॥ 52 ॥
భోగంబుల కాశింపక రాగద్వేషంబు రంగుడదమలో వేగమె మోక్ష పదంబును రాగను నాతండు యోగిరాయుడు వేమ! ॥ 53 ॥
చనువారెల్లను జనులం జనిపోయిన వారి పుణ్య సత్కథలెల్లన్ వినవలె గనవలె మనవలె నని మషులకు దెలుసగూడ దంత్యము వేమ! ॥ 54 ॥
ఆశయనెడి త్రాళ్ళ నఖిల జనంబులు కట్టుపడుచు ముక్తిగానరైరి జ్ఞానఖడ్గమునను ఖండింప రాదొకో విశ్వదాభిరామ వినుర వేమ! ॥ 55 ॥
అతిథి రాక చూచి యదలించి పడవైచి కఠిన చితులగుచు గానలేరు కర్మమునకు ముందు ధర్మము గానరో విశ్వదాభిరామ వినుర వేమ! ॥ 56 ॥
తను వలచిన దావలచును తను వలవక యున్ననెనడు తావలవ డిలన్ తనదు పటాటోపంబులు తన మాయలు పనికిరావు ధరలోన వేమ! ॥ 57 ॥
మాటలాడ వచ్చు మనసు నిల్వగలేదు తెలుపవచ్చు దన్ను తెలియలేదు సురియబట్టవచ్చు శూరుడు కాలేడు విశ్వదాభిరామ వినుర వేమ! ॥ 58 ॥
తనకేనాడు సుభిక్షము తనకేనాడును భగంబు తనరవయునం చును తన దశకై యెల్లెడ మనసందున జివుకుచుండు మహిలో వేమ! ॥ 59 ॥
ఎండిన మా నొకటడవిని మండిన నందగ్ని పుట్టి యూడ్చును చెట్లన్ దండిగల వంశమెల్లను చండాలుండొకడు పుట్టి చదుపును వేమ! ॥ 60 ॥
నిజము తెలిసియున్న సుజినుడానిజమునె పలుకవలయుగాని పరులకొరకు చావకూడ దింక నోపదవ్యం పల్క విశ్వదాభిరామ వినుర వేమ! ॥ 61 ॥
తామును జనులేమను కొన బూనుదురో దాని సరసి పొందిన జడనీ, రాని పధంబున నడిచిన దాననె ధర్మాత్ముడండ్రు తన్నిట వేమ! ॥ 62 ॥
వినియు వినకయుండు కనియు గనక యుండు తలచి తలపకుండు తాను యోగి మనుజవరులచేత మణిపూజ గొనుచుండు విశ్వదాభిరామ వినుర వేమ! ॥ 63 ॥
వెన్న చేతబట్టి వివరంబు తెలియక ఘృతము కోరునట్టి యతని భండి తాను దైవమయ్యు దైవంబు దలచును విశ్వదాభిరామ వినుర వేమ! ॥ 64 ॥
రూపువంక పేరు రూఢిగా నిలుచును పేరువంక క్రియలు పెనగుచుండు నాశమౌను తుదకు నామరూప క్రియల్ విశ్వదాభిరామ వినుర వేమ! ॥ 65 ॥
లోభమోహములను ప్రాభవములు తప్పు తలచిన పనులెల్ల తప్పి చనును తానొకటి దలచిన దైవమొండగుచుండు విశ్వదాభిరామ వినుర వేమ! ॥ 66 ॥
శాంతమే జనులను జయమునొందించును శాంతముననె గురువు జాడ తెలియు శాంత భావ మహిమ జర్చింపలేమయా విశ్వదాభిరామ వినుర వేమ! ॥ 67 ॥
వేషధారినెపుడు విశ్వసింపగరాదు వేషదోషములొక విధయె యగును రట్టుకాదె మునుపు రావణు వేషంబు విశ్వదాభిరామ వినుర వేమ! ॥ 68 ॥
ఇంగలంబు తోడ నిల సల్పుతోడను పరుని యాలితోడ పతితుతోడ సరసమాడుటెల్ల చావుకు మూలము విశ్వదాభిరామ వినుర వేమ! ॥ 69 ॥
ఐకమత్యమొక్క టావశ్యకం బెప్డు దాని బలిమి నెంతయైన గూడు గడ్డి వెంట బెట్టి కట్టరా యేనుంగు విశ్వదాభిరామ వినుర వేమ! ॥ 70 ॥
తామసించి చేయదగదెట్టి కార్యంబు వేగిరింప నదియు విషమగును పచ్చికాయదెచ్చి పడవేయ ఫలమౌనా? విశ్వదాభిరామ వినుర వేమ! ॥ 71 ॥
తల్లీ బిడ్డలకు తగవు పుట్టించెడి ధనము సుఖము గూర్చునని గడింత్రు కానీయెల్ల యెడల ఘన దుఃఖకరమది విశ్వదాభిరామ వినుర వేమ! ॥ 72 ॥
దొంగమాటలాడ దొరుకునె మోక్షము చేతగాని పలుకు చేటుదెచ్చు గురువుపద్దు కాదు గునహైన్య మదియగు విశ్వదాభిరామ వినుర వేమ! ॥ 73 ॥
నలుగురు కల చోటను దా దల చూపుచు మెలగుచుండి ధన్యాత గనగా దలచెడి యాతడు నిచ్చలు గల మాటలే పలుకుచుండగా దగు వేమ! ॥ 74 ॥
నడుచునిచ్చు నతని బత్తెమిచ్చిన వాని కడుపు చల్లజేసి ఘనత విడుచు నడుప నేర నేర నతడు నాలి ముచ్చేగదా విశ్వదాభిరామ వినుర వేమ! ॥ 75 ॥
పదుగురాడుమాట పాడియై ధరజెల్లు నొక్కడాడుమాట యెక్కదెందు వూరకుండు వాని కూరెల్ల నోపదు విశ్వదాభిరామ వినుర వేమ! ॥ 76 ॥
పతక మందు నొప్పు పలు రత్నముల పెంపు బంగరందు కూర్ప బరువు గనును గాని యితర లోహమైన హీనము గాదె విశ్వదాభిరామ వినుర వేమ! ॥ 77 ॥
జన్నములను మరియు జన్నియల ననేక ముల నొనర్చియున్న ఫలముకాన రాక యుండు నీతి లేకున్న మాత్రాన విశ్వదాభిరామ వినుర వేమ! ॥ 78 ॥
తప్పు పలుకు పలికి తాతోట చేసిన కూడియున లక్ష్మీ క్రుంగిపోవు నోటికుండ నీళ్ళు నొనరగా నిలుచునా విశ్వదాభిరామ వినుర వేమ! ॥ 79 ॥
భూమి నాది యనిన భూమి ఫక్కున నవ్వు దాన హీనుँ జూచి ధనము నవ్వు కదన భీతుँ జూచి కాలుँడు నవ్వును విశ్వదాభిరామ వినుర వేమ! ॥ 80 ॥
నీతి జ్యోతిలేక నిర్మలంబగు నేది ఎట్లు కలగుబర మదెంతయైన ధనము గలిగియున్న దైవంబు గలుగదు విశ్వదాభిరామ వినుర వేమ! ॥ 81 ॥
పగయుడగు గోపముడిగిన పగయుడుగన్ కోర్కెలుడుగు బరజన్మంపుం దగులుడుగు భేదముడిగిన త్రిగుణము లుడుగంగ ముక్తి స్థిరమగు వేమ! ॥ 82 ॥
పప్పులేని కూడు పరులకోసహ్యమే యుప్పులేని వాడె యధిక బలుడు ముప్పులేని వాడు మొదటి సుజ్జానిరా విశ్వదాభిరామ వినుర వేమ! ॥ 83 ॥
నిక్కమైన మంచి నీలమొక్కటి చాలు తళుకు బెళుకు రాలు తట్టెడేల చదువ పద్యమరయ జాలదా యొక్కటి విశ్వదాభిరామ వినుర వేమ! ॥ 84 ॥
పరుల దత్తమొప్పి పాలనచేసిన నిల స్వదత్తమునకు విను మడియగు నవని పరుల దత్త మహపరింపగ రాదు విశ్వధాబిరామ వినుర వేమ! ॥ 85 ॥
నిజములాడు వాని నిందించు జగమెల్ల నిజము బల్కరాదు నీచులకడ నిజ మహాత్ముగూడ నిజమాడవలయురా విశ్వదాభిరామ వినుర వేమ! ॥ 86 ॥
పదుగురాడుమాట పాడియై ధరజెల్లు నొక్కడాడుమాట యెక్కదెందు వూరకుండు వాని కూరెల్ల నోపదు విశ్వదాభిరామ వినుర వేమ! ॥ 87 ॥
పరుల మేలు చూచి పలుగాకి వలె నెప్పు వట్టి మాటలాడు వాడధముడు అట్టి వాని బ్రతుకు టదియేల మంటికా విశ్వధాబిరామ వినుర వేమ! ॥ 88 ॥
భయమంతయు దేహమునకె భయ ముడిగిన నిశ్చయంబు పరమాత్మునకే లయమంతయు జీవునకే జయమాత్మకు ననుచు జగతిँ జాటుర వేమ! ॥ 89 ॥
భూమి నాది యనిన భూమి ఫక్కున నవ్వు దాన హీనుँ జూచి ధనము నవ్వు కదన భీతుँ జూచి కాలుँడు నవ్వును విశ్వదాభిరామ వినుర వేమ! ॥ 90 ॥
మాటజెప్ప వినని మనుజుడు మూర్ఖుడు మాట విన్న నరుడు మానుడగును మాట వినగ జెప్ప మానుట కూడదు విశ్వదాభిరామ వినుర వేమ! ॥ 91 ॥
మనసు తెలిసి యొకని మాటకు బ్రతిచెప్ప సంతసించు నతడు చాలమెచ్చు మనసు దెలియకున్నడనియుచు ననునేదో విశ్వదాభిరామ వినుర వేమ! ॥ 92 ॥
ఆలిమాటలు విని అన్నదమ్ముల రోసి వేరేపోవువాడు వెర్రివాడు కుక్కతోక పట్టి గోదారీదినా? విశ్వదాభిరామ వినుర వేమ! ॥ 93 ॥
జ్ఞానియైనవాని మానక పూజించు మనుజుడెప్పుడు పరమునను ముదంబు సుఖమునందుచుండుసూరులు మెచ్చగ విశ్వదాభిరామ వినుర వేమ! ॥ 94 ॥
హాని కలుగబోదు హరిమది నెంచెడు వాని కబ్దు పరము వసుధయందు పూని నిష్ఠమీరి పొదలక యుండుము విశ్వరాభిరామ వినుర వేమ! ॥ 95 ॥
అల్పుడెప్పుడు పలుకు నాడంబరముగాను సజ్జనుండు పలుకు చల్లగాను కంచు మోగినట్లు కనకంబు మోగునా విశ్వదాభిరామ వినుర వేమ! ॥ 96 ॥
న్యాయశాస్త్ర మరయ నన్యాయమున దించు ధర్మశాస్త్ర మొసగు రుగ్మతంబు జ్యోతిషము జనముల నీతుల దప్పించు విశ్వదాభిరామ వినుర వేమ! ॥ 97 ॥
దేవుడనగ వేరే దేశముందున్నాడె దేహితోడ నెపుడు దేహమందె వాహనములనెక్కి పడిదోలుచున్నాడు విశ్వదాభిరామ వినుర వేమ! ॥ 98 ॥
భూమిలోన బుట్టు భూసారమెల్లను తనువులోన బుట్టు తత్త్వమెల్ల శ్రమలోన బుట్టు సర్వంబు తానౌను విశ్వదాభిరామ వినుర వేమ! ॥ 99 ॥
వ్రాతకంటె హెచ్చు పరమీదు దైవంబు చేతకంటె హెచ్చు వ్రాత లేదు వ్రాత కజుడు కర్త చేతకు దాకర్త విశ్వదాభిరామ వినుర వేమ! ॥ 100 ॥
చిప్పలోనబడ్డ చినుకు ముత్యంబయ్యె నీట బడ్డ చినుకు నీట గలిసె బ్రాప్తి గలుగు చోట ఫలమేల తప్పురా విశ్వదాభిరామ వినుర వేమ! ॥ 101 ॥
ఇంటి ఇంటిలోననీశ్వరుడుండగ నంటి చూడలేక యడవులందు నుంట మేటంచునుందురా జోగులై విశ్వదాభిరామ వినుర వేమ! ॥ 102 ॥
చిత్తశుద్ధి కలిగిచేసిన పుణ్యంబు కొంచెమైన నదియు కొదవగాదు విత్తనంబు మర్రి వృక్షంబునకు నెంతో విశ్వదాభిరామ వినుర వేమ! ॥ 103 ॥
అగ్నిబానా మేసి యంబుధి నింకించు రాముడవలి కేగ రాక, నిలిచి చెట్లు గిరులు తెచ్చి సేతువు గట్టడా విశ్వదాభిరామ వినుర వేమ! ॥ 104 ॥
ఐదు వేళ్లు బలిమి హస్తంబు పనిచేయు నం దొకండు విడ్డ పొందు చెడును స్వీయుడొకడు విడిన జెడుకదా పనిబల్మి విశ్వదాభిరామ వినుర వేమ! ॥ 105 ॥
ఆత్మబుద్ధి వలన నఖిలంబ తానయ్యె జీవబుద్ధి వలన జీవుడయ్యె మోహబుద్ధిలయము ముందర గనుగొను విశ్వదాభిరామ వినుర వేమ! ॥ 106 ॥
గుణములోగలవాని కులమెంచగానేల గుణము కలిగెనేని కోటిసేయు గణములేక యున్న గుడ్డిగవ్వయులేదు విశ్వదాభిరామ వినుర వేమ! ॥ 107 ॥
తల్లితండ్రులందు దయలేని పుత్రుండు పుట్టనేమి? వాడు గిట్టనేమి? పుట్టలోని చెదలు పుట్టదా గిట్టదా విశ్వదాభిరామ వినుర వేమ! ॥ 108 ॥
కోపమున ఘనత కొంచెమైపోవును కోపమునను గుణము కొరతపడును కోపమణచనేని కోరికలీడేరు విశ్వదాభిరామ వినుర వేమ! ॥ 109 ॥
ఎలుగు తోలు తెచ్చి ఏడాది యుతికినా నలుపు నలుపేకాని తెలుపుకాదు కొయ్యబొమ్మ తెచ్చి కొట్టితే గుణియోనె విశ్వదాభిరామ వినుర వేమ! ॥ 110 ॥
అల్పబుద్ధివానికధికారమిచ్చిన దొడ్డవారినెల్ల తొలగగొట్టు చెప్పుదినెడు కుక్క చెరకు తీపెరుగునా విశ్వదాభిరామ వినుర వేమ! ॥ 111 ॥
పట్టుపట్టరాదు పట్టివిడువరాదు పట్టెనేని బిగియ పట్టవలయు పట్టువిడుటకన్నా పడిచచ్చుటేమేలు విశ్వదాభిరామ వినుర వేమ! ॥ 112 ॥
తుమ్మచెట్టు ముండ్ల తోడనేపుట్టును విత్తులొననుండు వెడలునట్లు మూర్ఖునకును బుద్ధి ముందుగా బుట్టను విశ్వదాభిరామ వినుర వేమ! ॥ 113 ॥
కపటి వేషమూని కడగండ్లు పడనేల విపిన భూమి తిరిగి విసుగనేల యుపముతోనే ముక్తి ఉన్నది చూడరా విశ్వదాభి రామ వినుర వేమ ॥ 114 ॥
అనువుగాని చోట అధికులమనరాదు కొంచెముందుటెల్ల కొదువకాదు కొండ యద్దమందు కొంచమై ఉండదా విశ్వదాభిరామ వినుర వేమ! ॥ 115 ॥
మనసులోనున్న మర్మమంత ఎరిగి స్థిరము చేసి ఆత్మ తేటపరిచి ఘటము నిల్పవలయు, ఘనతలింకేటికి విశ్వదాభి రామవినుర వేమ! ॥ 116 ॥
కదలనీయకుండ గట్టిగా లింగంబు కట్టివేయనేమి ఘనత కలుగు భావమందు శివుని భావించి కానరా విశ్వదాభిరామ వినుర వేమ! ॥ 117 ॥
మేక జంకబెట్టిమెలగుచు మందలో బ్రమని తిరుగు గొల్ల పగిదిగాను దేవునెరుగక పరదవేతల దలచు విశ్వదాభిరామ వినుర వేమ! ॥ 118 ॥
తన కుల గోత్రము లాకృతి తన సంపద కలిమి బలిమి తనకేలనయా? తన వెంటరావు నిజమిది తన సత్యమే తోడువచ్చు తనతో విశ్వదాభిరామ వినుర వేమ! ॥ 119 ॥
కలిమిగల్గనేమి కరుణ లేకుండిన కలిమి తగునె దుష్టకర్ములకును తేనెగూర్పనీగ తెరువున బోవదా విశ్వదాభిరామ వినుర వేమ! ॥ 120 ॥
ఎండిన మానొకటడవిని మండిన నందగ్ని పుట్టి యూడ్చును చెట్లన్ దండిగల వంశమెల్లను చండాలుండొకడు పుట్టి చదువును వేమ! ॥ 121 ॥
కనులు పోవువాడు కాళ్లు పోయినవాడు ఉభయులరయుగూడి యుండినట్లు పేద పేద గూడి పెనగొని యుండును విశ్వదాభిరామా వినుర వేమ! ॥ 122 ॥
మాటలాడు గల్గు మర్మములెరిగిన పిన్నపెద్దతనము లెన్నవలదు పిన్నచేతి దివ్వె పెద్దగా వెలగదా? విశ్వధాభిరామ వినుర వేమ! ॥ 123 ॥
కొండముచ్చు పెండ్లికి కోతి పేరంటాలు మొండి వాని హితుడు బండవాడు దుండగీడునకును కొండెడు దళవాయి విశ్వదాభిరామా వినుర వేమ! ॥ 124 ॥
ఝుషము నీరు వెడల జచ్చుటే సిద్ధము నీటనుండనేని నిక్కిపడును అండతొలుగు నెడల నందర పని అట్లే విశ్వదాభి రామ వినుర వేమ! ॥ 125 ॥
తల్లియేడ్వ వినక తనయాలు వగచిన జాలిపడెడు వాడు జడుడు సుమ్మి తారతమ్య మెరుగనేరని పశువది విశ్వదాభిరామ వినుర వేమ! ॥ 126 ॥
పరులమేలు చూసి పలుకాకి వలె వట్టిమాటలాడు వాడు అధముడు అట్టివాని బతుకుటది ఏల మంటికా? విశ్వదాభిరామ వినుర వేమ! ॥ 127 ॥
గంగి గోవుపాలు గరిటడైనను చాలు కడవెడైనను నేమి ఖరముపాలు భక్తికల్గుకూడు పట్టెడైనను చాలు విశ్వదాభిరామ వినుర వేమ! ॥ 128 ॥
చిక్కియున్నవేళ సింహంబునైనను బక్క కుక్కయైనా బాధసేయు బలిమిలేని వేళ పంతములు చెల్లవు విశ్వదాభిరామ వినుర వేమ! ॥ 129 ॥
పనసతొనలకన్న పంచదారలకన్న జుంటితేనెకన్న జున్నుకన్న చెఱుకు రసముకన్న చెలుల మాటలె తీపి విశ్వదాభిరామ వినుర వేమ! ॥ 130 ॥
నిండునదులు పారు నిలచి గంభీరమై వెఱ్రివాగు పాఱు వేగబొర్లి అల్పుడాడురీతి నధికుండు నాడునా విశ్వదాభిరామ వినుర వేమ! ॥ 131 ॥
ఉప్పులేనికూర యొప్పదు రుచులకు పప్పులేని తిండి ఫలములేదు అప్పులేనివాడె యధిక సంపన్నుడు విశ్వదాభిరామ వినుర వేమ! ॥ 132 ॥
పసుల వన్నె వేరు పాలెల్ల ఒక్కటి పుష్పజాతి వేరు పూజ ఒకటి దర్శనంబులారు దైవంబు ఒక్కటి విశ్వదాభిరామ వినుర వేమ! ॥ 133 ॥
చంపదగిన శతృవు తనచేత చిక్కెనేని కీడు చేయరాదు పొసగ మేలు చేసి పొమ్మనుటే మేలు విశ్వదాభిరామ వినుర వేమ! ॥ 134 ॥
ఆపదగల వేళ అరసి బంధువు జూడు భయము వేళ జూడు బంటుతనము పేదవేళ జూడు పెండ్లాము గుణము విశ్వదాభిరామ వినుర వేమ! ॥ 135 ॥
ఉప్పు కప్పురంబు ఒక్క పోలికనుండు చూడ చూడ రుచుల జాడ వేరు పురుషులందు పుణ్య పురుషులు వేరయ విశ్వదాభిరామ వినుర వేమ! ॥ 136 ॥
ఆత్మ శుద్ది లేని యాచారమదియేల భాండశుద్ది లేని పాక మేల చిత్తశుద్దిలేని శివపూజలేలరా విశ్వదాభిరామ వినుర వేమ! ॥ 137 ॥
యినుము విరగనేని యినుమూరు ముమ్మారు కాచియెతకవచ్చు గ్రమము గాను మనసు విరిగెనేని మరి చేర్చరాదయా విశ్వదాభిరామ వినుర వేమ! ॥ 138 ॥
కుండ కుంభమన్న కొండ పర్వతమన్న నుప్పు లవణమన్న నొకటి కాదె భాష లిట్టె వేరు పరతత్వమొకటె విశ్వదాభిరామ వినుర వేమ! ॥ 139 ॥
అనగ ననగ రాగ మతిశ యిల్లుచునుండు దినగ దినగ వేము తియ్యనుండు సాధనమున పనులు సమకూరు ధరలోన విశ్వదాభిరామ వినుర వేమ! ॥ 140 ॥
చెప్పులోని రాయి చెవిలోని జోరీగ కంటిలోని నలుసు కాలి ముల్లు ఇంటిలోని పోరు నింతింత గాదయా విశ్వదాభిరామ వినుర వేమ! ॥ 141 ॥
తప్పు లెన్నువారు తండోప తండంబు లుర్వి జనులకెల్ల నుండు తప్పు తప్పు లెన్నువారు తమ తప్పులెరుగరు విశ్వదాభిరామ వినుర వేమ! ॥ 142 ॥
మిరప గింజ చూడ మీద నల్లగనుండు కొరికి జూడలోన జురుకుమనును సజ్జను లగు వారి సార మిట్లుండు విశ్వదాభిరామ వినుర వేమ! ॥ 143 ॥
మేడిపండు చూడ మేలిమై యుండును పొట్టవిచ్చి చూడ పురుగులుండు పిరికివాని మదిని బింకమీలాగురా విశ్వదాభిరామ వినుర వేమ! ॥ 144 ॥
వేరు పురుగు చేరి వృక్షంబు జెరుచును చీడపురుగు చేరి చెట్టు జెరచు కుత్సితుండు చేరి గుణవంతు జెరచురా విశ్వదాభిరామ వినుర వేమ! ॥ 145 ॥
వేషభాష లెరిగి కాషయవస్త్రముల్ గట్టగానె ముక్తి గలుగబోదు తలలు బోడులృన తలపులు బోడులా విశ్వదాభిరామ వినుర వేమ! ॥ 146 ॥
Browse Related Categories: